ఉద్యోగ వర్గాలు… ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా నిలిచాయి. రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యోగ సంఘాల పాత్ర చాలా కీలకమైంది. అంతేకాదు, రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సీఎం అయిన తరువాత కూడా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినవారికి ప్రభుత్వంలో కీలక పదవులు కూడా ఇచ్చారు. ఫిట్మెంట్స్, పీఆర్సీల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందీ అంటే… ముఖ్యమంత్రి తీరుకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సంఘటితమౌతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో… కొద్దిరోజుల కిందట రెవెన్యూ ఉద్యోగుల విషయంలో కూడా ఆయన కఠిన వైఖరే ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగులంటే ప్రేమాభిమానాలు ప్రదర్శించిన కేసీఆర్, ఇప్పుడెందుకు ఇలా మారిపోయారు? అత్యంత కీలకమైన ఉద్యోగ వర్గంలో వ్యతిరేకత పెరిగితే జరిగే నష్టమేంటో కేసీఆర్ కి తెలియందా? తెలిసీ ఇలా వ్యవహరిస్తున్నారంటే ఆయన వ్యూహం వేరే ఏదైనా ఉందా..? ఏదో ఆశించే ఇలా చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
కేసీఆర్ తీరు మీద విశ్లేషకుల్లో ప్రధానంగా కలుగుతున్న అనుమానం ఏంటంటే… ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం తనపై పడకుండా ముఖ్యమంత్రి జాగ్రత్తపడే క్రమంలో ఉన్నారూ అనేది! ఉదాహరణకు రెవెన్యూ శాఖ తీసుకుంటే… ఇది చాలా అద్భుతంగా పనిచేస్తోందని గతంలో కేసీఆర్ మెచ్చుకున్నారు. కానీ, ఆ శాఖలో అవినీతి తారస్థాయిలో ఉందని అందరికీ తెలిసిందే. అయితే, ఈ అవినీతి దగ్గరకి వచ్చేసరికి… ఇది ఉద్యోగుల చేస్తున్న అవినీతే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దాన్లో భాగంగా ఉద్యోగులపై గరంగరం అవుతూ, తాము చిత్తశుద్ధితో ఉన్నా వారే సరిగా పనిచేయడం లేదనీ, అది తమ రాజకీయ వైఫల్యం కాదనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా అదే జరుగుతోంది. సమ్మె మొదలైన దగ్గర్నుంచీ దీన్ని ప్రజల కష్టాల కోణం నుంచి మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్తున్నారు. పండుగ పూట ప్రజలను ఇబ్బందిపెడుతున్నారనీ, సంస్థ నష్టానికి ఉద్యోగులే కారణమనీ, ఉద్యోగుల తీరు వల్లనే ఇవాళ్ల ప్రజా రవాణా స్తంభించిందనీ… ఇలా చెబుతూ ఈ పరిస్థితి రావడం వెనకున్న రాజకీయ వైఫల్యం వైపు ప్రజల దృష్టి మళ్లకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నట్టుగా చెప్పొచ్చు. రెవెన్యూ, ఆర్టీసీ ఉద్యోగుల స్థాయి దాటి చూస్తే… ప్రభుత్వం అప్పులు పెరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలు రానురానూ భారమనే అభిప్రాయం ఉంది, వడ్డీల భారం పెరుగుతోంది, రైతు బంధు చెక్ లు ఆగిపోయాయి, చాలా రకాల బిల్లులు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ గమనిస్తే ఆర్థిక మందగమనం దిశగా రాష్ట్రం వెళ్తోందనే సంకేతాలున్నాయి. ఫలితంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలూ సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. దానికి కారణం తమ రాజకీయ విధానాలు కాదనీ, ఉద్యోగుల తీరే కారణమని ఎత్తి చూపేందుకు అనువైన ఒక వ్యూహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కేసీఆర్ బాగానే చేస్తున్నారు, కానీ ఉద్యోగులే బాగా చేయడం చేయడం లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ముందస్తు ప్రయత్నంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రజల్లో అసంతృప్తి తారస్థాయికి చేరితే… ఈ వాదన కేసీఆర్ కి కవచంగా పనికొస్తుందా అంటే, అస్సలు పనికిరాదు. ఎందుకంటే, ఉద్యోగులు విధులు నిర్వహించేది అధికార పార్టీ నిర్ణయాలకు లోబడే అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!