తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. స్పెషలాఫీసర్ల పాలన వచ్చింది. ఎన్నికలు నిర్వహించేస్తున్నామని ప్రభుత్వం హడావుడి చేసింది. ఎనిమిది వేల పంచాయతీలకు తోడు.. కొత్తగా మరో నాలుగువేల పంచాయతీల్ని ఏర్పాటు చేసింది. ఈ నాలుగు వేల పంచాయతీల్ని ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకోమని.. ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ కొత్త పంచాయతీలకు ఎన్నికల్లేవు. తమ ప్రజాప్రతినిధుల్లేరు. వీరెవరూ లేకుండా.. ప్రజలు ఎలా సంబరాలు జరుపుకుంటారు…?
ఎన్నికలు లేని పంచాయతీల్లో సంబరాలెందుకు..?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత.. కిరణ్ నేతృత్వంలో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుందా..? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక.. స్వపరిపాలన వచ్చిన తర్వాత.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు. పంచాయతీల్లో కూడా అంతే. కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి. కానీ ప్రజాప్రతినిధులు లేరు. స్థానిక ప్రభుత్వం ఏర్పడలేదు. మరి సంబరాలు ఎవరు చేసుకుంటారు..? చేసుకుంటే.. అధికార పార్టీ నేతలు చేసుకుంటారు. ప్రభుత్వ ఖర్చులతో అధికార పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటారన్నమాట. అంటే నాలుగు వేల పంచాయతీల్లో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో.. ప్రభుత్వ ఖర్చులతో.. అధికార పార్టీ సంబరాలు జరుపుకోవడానికి ఇదో కార్యక్రమం. ఇది ఏ రకంగా న్యాయ సమ్మతం…?
పంచాయతీ ఎన్నికలు జరపొద్దని హైకర్టు చెప్పలేదు..!
పంచాయతీ ఎన్నికలు జరపవద్దని హైకోర్టు వద్దన్నదని ప్రచారం చేస్తున్నారు. ఇందులో అసలు నిజం ఏమిటంటే.. ఎన్నికలు జరపవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదు. బీసీల జనాభా లెక్కలు తీశారా అని హైకోర్టు ప్రశ్నించింది. బీసీలకు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కేటాయించారని కూడా ప్రశ్నించింది. ఎంబీసీలకు కూడా వర్గీకరణ చేస్తామన్నారు.. మరి ఎంబీసీల జనాభా లెక్కలు తీశారా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. తీయలేదని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అలాంటప్పుడు ఏ రకంగా రిజర్వేషన్లు నిర్ణయిస్తారని.. హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండాలి. సమగ్ర కుటుంబ సర్వే చేశారు. కానీ అందులో లెక్కలు సరిగ్గా లేవంటున్నారు. ఆ లెక్కలు సరిగ్గా లేనప్పుడు బీసీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారని హైకోర్టు అడిగింది. అంతే తప్ప..ఎన్నికలు వద్దని హైకోర్టు చెప్పలేదు. ఇప్పటికీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఎంబీసీల లెక్కలు తీసి కోర్టుకు సమర్పిస్తే ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది. కానీ ఆ పని చేయలేదు. పైగా.. తీర్పుపై అప్పీలుకు వెళ్లి ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. ఏమీ చేయకుండా..ఎన్నికలను ప్రభుత్వమే వాయిదా వేసుకుంది. రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికలు జరపొద్దని కోర్టు ఎప్పుడూ చెప్పదు.
ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలు జరపాలని లేదు..!
బీసీ జనాభా ఇష్యూ… ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉంది. మరి ఈ ఐదేళ్లు ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది. బీసీల విషయం..కోర్టు ముందుకు వస్తుందని అందరికీ తెుసు. ఎందుకంటే.. ఉమ్మడి ర ాష్ట్రంలోనే ఈ ప్రశ్న వచ్చింది. అందుకే ఏడాది కిందో.. ఆరు నెలల కిందో.. బీసీ లెక్కలు తీసి.. రిజర్వేషన్లు నిర్ణయించి ఉంటే.. పంచాయతీ ఎన్నికలకు అడ్డంకి ఉండేది కాదు. ప్రభుత్వం ఆ పని చేయలేదు. అందువల్ల మనం ఏమి అనుకోవాలంటే.. ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలు జరపాలని లేదు. దానికి రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఎప్పుడైనా అధికార పార్టీ హవా కనిపిస్తుంది. అది తెలంగాణలోనే ఎక్కువ. కానీ పంచాయతీ ఎన్నికల వరకు వచ్చే సరికి గ్రామ రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి.
సానుకూల వాతావరణం చెడగొట్టుకోవడం ఎందుకన్న భావనలో కేసీఆర్..!
గ్రామాల్లో ఇప్పుడు నేతలందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారు. సర్పంచ్ కావాలనుకునే.. వారంతా.. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరందరూ టీఆర్ఎస్ కే మద్దతిస్తారు. కానీ పంచాయతీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి ఒకరు టీఆర్ఎస్ తరపున ఉంటారు. మిగతా ఇద్దరు ముగ్గురు.. ఇతర పార్టీల వైపు వెళ్లిపోతారు. ఇలా గ్రామాల్లో తమ నేతలు గ్రూపులుగా మారడం… నష్టమని టీఆర్ఎస్ అంచనా. ఎన్నికలు జరిపి.. ఈ పంచాయతీ ఎందుకు తెచ్చుకోవాలని భావించారు. ఇప్పటికే మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలు కూడా చూస్తున్నాం. అందుకే.. ఇప్పుడు టీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి అనవసరంగా దానిని చెడగొట్టుకోవడం ఎందుకన్నది టీఆర్ఎస్ భావన. అందువల్లే ఎన్నికలు వాయిదా వేసే రీతిలో.. పంచాయతీ ఎన్నికలపై.. టీఆర్ఎస్ వ్యవహరించింది. లేదనుకుంటే ఏడాది కిందటే బీసీ లెక్కలు తేల్చేసి ఉండేవారు. ఇప్పటికైనా బీసీ లెక్కలు తీసి ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంది.
అధికారులతో పాలన రాజ్యాంగ ఉల్లంఘనే..!
స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా..! 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరపకుండా.. చీఫ్ సెక్రటరీ పాలన నిర్వహించవచ్చు కదా. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా…అధికారులతో పాలన సాగిస్తామంటే.. రాష్ట్రంలో కూడా చీఫ్ సెక్రటరీతో పాలన జరపొచ్చు. ఇదేమి అసాధ్యం కాదు. జిల్లాల్లో ఎమ్మెల్యేల అవసరం లేదు. కలెక్టర్లు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతోనే పాలన సాగాలి. ప్రజాస్వామ్యానికి అదే నిర్వచనం. భారత రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీ లాగానే పంచాయతీ కూడా స్థానిక ప్రభుత్వమే. వాటికి కాలపరిమితి ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘనే. మామూలుగా అయితే ప్రజాప్రతిధులు లేకపోయినా పాలన సాగుతుంది. కానీ అది రాజ్యాంగబద్ధం కాదు.