2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కేసీఆర్ అహంకారం కూడా ఓ కారణమనే వాదన ఉంది. ముఖ్యమంత్రిగా ప్రతి విషయంలో మొండిగా నిర్ణయాలు తీసుకొని అధికారం కోల్పోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు సరే.. కానీ ప్రతిపక్ష నేతగా పరిమితమయ్యాక కూడా అదే అహంకారం ప్రదర్శిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కేసీఆర్ నల్గొండ సభ, సూర్యాపేటలో ప్రెస్ మీట్ , తాజాగా సిరిసిల్లలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలను ఎత్తిచూపిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎత్తేందుకు మాత్రం ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి అని సంబోధిస్తున్నా.. రేవంత్ పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. గతంలోనూ కేసీఆర్ ఇలాగే వ్యవహరించేవారు. ఇప్పుడూ అదే వ్యవహారశైలిని కొనసాగిస్తున్నారు.
రేవంత్ పేరును కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించడం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని.. అదే సమయంలో రేవంత్ అంటే కేసీఆర్ భయపడిపోతున్నారని అందుకే ఆయన పేరును ప్రస్తావించడం లేదని కాంగ్రెస్ లీడర్లు చెప్పుకొస్తున్నారు. ఏదీ ఏమైనా… ఇలాంటి అహంకార పోకడలు బీఆర్ఎస్ భవిష్యత్ కు మంచివి కావని సూచిస్తున్నారు ఎనలిస్టులు.