హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహత్ ఆత్మహత్య యూపీలో జరిగిన ‘దాద్రి’ ఘటన స్థాయిలో సంచలనం రేకెత్తించి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధి, సీతారామ్ ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్ వంటి జాతీయస్థాయి నేతలందరూ వచ్చి హెచ్‌సీయూను సందర్శించి వెళ్ళారు… ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఈ వివాదం ఇంత అట్టుడుకుతున్నా, ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చర్చనీయాంశమయింది. ఆఖరికి, బీజేపీ తమ మిత్ర పక్షమైనప్పటికీ, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రోహిత్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు… తన పార్టీ తరపున మృతుడి కుటుంబానికి రు.5 లక్షల ఆర్థిక సాయం, రోహిత్ తల్లికి, సోదరుడికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. మరి కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవటానికి వెనక అంతరార్థం ఏమయిఉంటుందన్నదే ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మౌనంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ముఖ్యమంత్రికి కొత్తబట్టలు కొనుక్కోవటానికి తీరిక ఉంది కానీ ఆందోళన చేస్తున్న విద్యార్థులను పలకరించటానికి తీరిక లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సీఎమ్ వైఖరి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైనవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని అన్నారు.
వాస్తవానికి ఘటన జరిగిన మరుసటిరోజే కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఈ ఘటనను ఖండించి, కేంద్రమంత్రి దత్తాత్రేయపై తీవ్ర విమర్శలు చేేశారు. తన సంస్థ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో దత్తాత్రేయ ఇంటిని ముట్టడింపజేశారుకూడా. అయితే ఏమయిందో, ఏమోగానీ ఇక ఆ తర్వాత మళ్ళీ అధికారపార్టీనుంచి స్పందన లేదు. అనధికారిక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ కూడా స్పందించలేదు. హోమ్ మంత్రి నాయని నర్సింహారెడ్డిని కొంతమంది విలేకరులు అడిగితే ఈ వివాదాన్ని రాజకీయం చేయదలుచుకోలేదంటూ చిలక పలుకులు పలికారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఈ ఘటనపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్ళి ఆందోళన చేస్తున్న విద్యార్థులను పలకరించి వచ్చారు.
కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఈ విషయంపై మౌనంగా ఉన్నారని అంటున్నారు. దీనికి రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కేంద్రంతో ఘర్షణ పడకూడదని నిర్ణయించుకున్నట్లు ఇటీవల పరిణామాలరీత్యా అర్థమవుతోంది. ఫిబ్రవరిలో జరిగే మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు నరేంద్రమోడిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించటం, దానికి మోడి సంసిద్ధత వ్యక్తం చేయటం తెలిసిందే. కేంద్రం పట్ల టీఆర్ఎస్ వైఖరిలో మార్పుకు కారణం కేసీఆర్‌పై సీబీఐ కేసు ప్రభావంకూడా అయిఉండొచ్చన్న వాదనలో నిజమెంతో, అబద్ధమెంతో తెలియనప్పటికీ ఈ వివాదం ఇద్దరు కేంద్ర మంత్రులకు ముడిపడి ఉండటంతో, దీనిపై స్పందిస్తే మోడితో వైరం పెట్టుకున్నట్లవుతుందని టీఆర్ఎస్ మౌనం వహించి ఉండొచ్చు. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నందున, ఈ సమయంలో ఈ సున్నితమైన అంశంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం వలన టీఆర్ఎస్ విజయావకాశాలు దెబ్బ తింటాయని కూడా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. చివరిగా, బాధితుడు రోహిత్ తెలంగాణకు చెందినవాడు కాదన్న విషయం తెలిసిందే. అతని సామాజికవర్గంగా చెబుతున్న ఎస్సీ మాల వర్గం తెలంగాణలో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వివాదంలో బాధితుడికి సంతాపం తెలిపినా తెలపకపోయినా వచ్చే రాజకీయ లబ్ది ఏమీలేదని టీఆర్ఎస్ లెక్కలేసుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా, ఈ వివాదంలో రోహిత్ ఆత్మహత్య చేసుకోవటంపైనగానీ, ఈ కేసులో దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చటంపైగానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పందించి ఉండాల్సింది. రోహిత్ కులం ఏదైనా అయి ఉండొచ్చు… ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి యూనివర్సిటీలో రాజకీయాల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఇంతటి వివాదం చోటు చేసుకున్నపుడు కేసీఆర్ అతడి మృతికి సంతాపం వ్యక్తం చేయటం కనీస ధర్మం. ఈ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు మాత్రం సబబు కాదు.