జగన్ కేసీఆర్ ల మధ్య ఉన్న బంధం కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విమర్శలు చేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో కేసీఆర్, జగన్ లని తూర్పారబడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “జగన్ తెలంగాణలో పోటీ చేద్దామని అనుకుంటే, తెలంగాణలో అడుగు పెడితే, ఇలాంటి ఫ్యాక్షనిస్టులు మాకొద్దంటూ, ఇలాంటి రౌడీ రాజకీయాలు మాకొద్దంటూ కేసీఆర్ గతంలో జగన్ ని రాళ్లతో కొట్టించాడు. కానీ అదే జగన్ ని ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రం ముఖ్యమంత్రిని చేయాలని తెగ ప్రయత్నిస్తాడు. మీకు అక్కర్లేని జగన్ ను మా మీద మాత్రం ఎందుకు రుద్దుతారు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా వచ్చి రాజకీయాలు చేయాలని, ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ని టీఆర్ఎస్ అభ్యర్థి అంటూ బహిరంగంగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు.
అదే విధంగా కేసీఆర్ తో పెట్టుకుంటే తెలంగాణలో ఉన్న ఆస్తులకు భద్రత ఉండదని వస్తున్న వ్యాఖ్యల పై కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. తెలంగాణ ఏమి పాకిస్తాన్ లో లేదని, ఆస్తులు లాక్కోవాలని కేసీఆర్ అనుకుంటే దానికి తాను భయపడనని, తన ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఎదురొడ్డి నిలబడతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏది ఏమైనా వైకాపా – కేసీఆర్ ల మధ్య ఉన్న బంధాన్ని హైలెట్ చేస్తూ, తమదైన శైలిలో విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి భారీ స్పందన వచ్చింది.