తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… రోజుకు ఆరేడు సభల్లో ప్రసంగిస్తున్నారు. తనను మళ్లీ ఎందుకు సీఎం చేయాలనేదానిపై ఆయన ఒక్క కారణాన్ని పదే పదె చెబుతున్నారు. గత యాభై ఏళ్లలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని.. ప్రతి ఐదు నిమిషాలకో సారి గుర్తు చేస్తున్నారు. రెండో సారి పవర్ లోకి రావడానికి కేసీఆర్ పూర్తిగా “పవర్” నే నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూముల ఇళ్ల దగ్గర్నుంచి కేజీ టూ పీజీ విద్య వరకూ… అన్ని ప్రధానమైన హామీలు ఇంకా హామీల్లాగే ఉన్న సందర్భంలో.. కేసీఆర్.. తన పై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి తాను ఎంతో జన రంజకంగా పాలించానని చెప్పుకోవడావికి కరెంట్ ను మాత్రమే ప్రధానాస్త్రాంగా వాడుకుంటున్నారు. తన ఘనతగా చెప్పుకోవడమే కాదు.. ఇతర పార్టీలు, ఆయా పార్టీ అగ్రనేతల సామర్థ్యాన్ని కూడా కరెంట్ తో ముడిపెట్టి వాళ్లకేమీ చేతకాదని చెబుతున్నారు.
చంద్రబాబు తనకు తాను ప్రపంచ మేధావిగా చెప్పుకుంటారని.. అంత మేధావి.. తను పాలించినప్పుడు కరెంట్ ఎక్కడ దాచి పెట్టారని లాజిక్ లేని ప్రశ్నలు వేస్తున్నారు. యాభై ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కరెంటివ్వలేదని తాను మాత్రమే… ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నానంటున్నారు. కేసీఆర్ కు చెప్పుకోవడానికి … ఇంతకు మించి ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ కరెంట్ ను ఉపయోగించుకుని తన పార్టీకి పవర్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు వేగంగానే గుర్తించి విమర్శలు ప్రారంభించారు. బయట నుంచి రూ. వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం.. పెద్ద విజయమా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత..? ఇప్పుడు.. తెలంగాణ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత .. చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి… ఈ నాలుగున్నరేళ్ల కాలంలో.. ఒక్క మెగావాట్ కూడా… విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయలేదుని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసి.. కమిషన్లు తీసుకంటూ.. దాన్ని తన ఘనతగా చెప్పుకోవడం ఏమిటని.. అసలు నిజాలేమిటో తేల్చుకుందాం.. బహిరంగ చర్చకు రావాలని… కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అయినా సరే తన తురపుముక్కగా కేసీఆర్.. ఇరవై నాలుగు గంటల కరెంట్ వాడేసుకుంటున్నారు.