కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పొత్తులపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టమని చెబుతున్నారు. టీడీపీకి ఎలాంటి ఓటింగ్ లేదంటున్నారు. కానీ గత ఎన్నికల్లో అంటే 2014లో చాలా సీట్లలో..టీఆర్ఎస్కు వచ్చిన మెజార్టీతో పోలిస్తే.. టీడీపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్, టీడీపీ కలిస్తే.. అనేక నియోజకవర్గాల్లో టీఆరెస్ కన్నా.. కాంగ్రెస్ టీడీపీ కూటమి ముందంజలో ఉంటుంది. రెండు పార్టీలు లాభపడతాయి.
టీడీపీతో పొట్టుకుంటే కాంగ్రెస్‌కు నష్టమా..?
అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పూర్తిగా ఈ వాదనను కొట్టి పడేస్తున్నారు. కేవలం 0.1, 0.2 శాతం ఓట్లు మాత్రమే టీడీపీకి ఉన్నాయంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందా లేదా అన్నది చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం టీడీపీ 2014తో పోలిస్తే చాలా బలహీనపడింది. అందులో అనుమానం లేదు. కేసీఆర్ టీడీపీని బలహీనం చేశారు. కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన నేత కనుక.. టీడీపీ బలం ఏమిటి..? బలహీనత ఏమిటి..? అనేది కేసీఆర్‌కు బాగా తెలుసు. ఆ వీక్నెస్ను పట్టుకుని టీడీపీని బలహీనం చేశారు. పైగా.. టీడీపీని ఆంధ్రా పార్టీ అని ప్రచారం చేశారు. మొన్నటి ప్రెస్మీట్లో కూడా కేసీఆర్ అదే చెప్పారు. టీడీపీ లాంటి ఆంధ్రాపార్టీతో కలిస్తే… కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు. కానీ టీడీపీ వాళ్లు ఏమంటారు..? తెలంగాణ పార్టీతో ఆంధ్రాలో కలిస్తే నష్టం కానీ.. ఆంధ్ర పార్టీతో తెలంగాణలో కలిస్తే లాభం ఉంది అనే భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
కేసీఆర్ అనుకుంటున్నంతగా టీడీపీ బలహీనపడిందా..?
టీడీపీ బలహీనపడిన మాట నిజం. టీడీపీని బలహీనపడేలా చేసింది నిజం. లీడర్లను చేర్చుకున్నారు. నేతల్ని ఆకర్షించారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును ఆయుధంగా వాడుకుని… చంద్రబాబును తెలంగాణ పార్టీ నాయకత్వానికి దూరం చేశారు. ఇదంతా ఎందుకు చేశారు..? టీడీపీకి బీసీల్లో ఎంతో ఆదరణ ఉంది. ఆ ఆదరణ టీఆర్ఎస్కు దక్కేలా..ప్లాన్ చేసుకున్నారు. ఆ వర్గాలను టీడీపీకి దూరం చేస్తూ… బీసీలను ఆకట్టుకునేందుకు అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. ఇదంతా పకడ్బందీగా… టీడీపీని సంస్థాగతంగా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇక సీమాంధ్ర ఓట్లు కూడా.. టీడీపీకి బలం. సీమాంధ్ర ఓటర్లు… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనవైపు ఆకర్షించేలా ప్రయత్నించారు. సీమంధ్రులను కూడా అభ్యర్థులను పెట్టారు. గతంలో టీఆర్ఎస్పై సీమంధ్రులకు ఉన్నంత వ్యతిరేకత ఉండదని కేసీఆర్ అనుకుని ఉంటారు.
టీడీపీ- కాంగ్రెస్ పొత్తు జోష్ నింపుతుందా..?
టీడీపీ బలహీనపడిన మాట నిజమే కానీ… కేసీఆర్ చెప్పినంతగా వీక్ అయిందా లేదా.. అన్నది సందేహం. పొలిటికల్ కెమిస్ట్రీ ఏమిటంటే… టీడీపీ అనుకూల ఓటర్.. నిరాశతో… నిస్పృహతో చెల్లాచెదురై ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ – టీడీపీ కలవడం వల్ల మళ్లీ సమీకృతం అయ్యే అవకాశం ఉందా..? అలా టీడీపీ ఎంత వరకు .. తన ఓటింగ్‌ను సమీకృతం చేసుకోగలగుతుందనేది ముఖ్యం. రెండు పార్టీలు కలసినప్పుడు సహజంగానే… జోష్ వస్తుంది. అలాంటి జోష్ వస్తే… టీఆర్ఎస్కు చాలెంజ్ ఏర్పడవచ్చు. అందుకే కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ పొత్తును టార్గెట్ చేస్తున్నారని భావించవచ్చు.