చంద్రబాబు విషయంలో..మాత్రం.. కేసీఆర్ గ్రేటర్ లో వ్యూహం మార్చారు. తెలుగుదేశం పార్టీ చేస్తోంది పదమూడు స్థానాల్లోనే నని.. అంత మాత్రం దానికే ఆయన పెత్తనం చేస్తారా..ఆరుస్తాడా..? తీరుస్తాడా..? అని ప్రసంగించి.. వినేవాళ్లందరూ విస్మయం వ్యక్తం చేసేలా చేశారు. 13 స్థానాలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థాపిస్తారా? అని ప్రశ్నించారు. నిజానికి కేసీఆర్ ప్రచారం మొత్తం.. చంద్రబాబు సెంట్రిక్ గా కొనసాగించి.. గ్రేటర్ మినహా మిగతా జిల్లాల ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశం.. చంద్రబాబు తెలంగాణపై పెత్తనం చేయడానికి వస్తున్నారనే..! మరి ఇన్ని రోజులు.. చంద్రబాబు తన అభ్యర్థుల్ని కేవలం పదమూడు స్థానాల్లోనే పోటీ చేస్తున్నారని కేసీఆర్ కు తెలియదా..? పెత్తనం చేయలేడని తెలిసి కూడా… ఎందుకు ఇంత కాలం .. చంద్రబాబు తెలంగాణపై దండయాత్రకు వస్తున్ననట్లుగా ప్రొజెక్ట్ చేయడం..? ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును.. గ్రేటర్ లో ఓ రకంగా… ఇతర జిల్లాల్లో మరో రకంగా… ఉపయోగించుకునే ప్రయత్నం చేశారన్న విషయం మాత్రం క్లారిటీకి వచ్చింది.
చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని కేసీఆర్ చెబుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరం.. ఏ ఒక్కరి సొత్తు కాదని హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ తేల్చారు. చంద్రబాబు హైదరాబాద్ వచ్చి సెటిలర్స్‌ని ఇబ్బంది పెడుతున్నారని… జంటనగరాల ప్రజలు చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ భేదాలు లేవన్నారు. ఆంధ్రా వాళ్లం అన్న భావన వీడండని పిలుపునిచ్చారు. హైదరాబాదీలం అని గర్వంగా చెప్పాలన్నారు. నిజానికి ఏ సెంటిమెంట్ తెలంగాణ ఎన్నికల ప్రారంభ సమయంలో లేదు. కేవలం కేసీఆర్ మాత్రం.. తన రాజకీయ స్వార్థం కోసం… ఆంధ్రులపై ఘాటు విమర్శలు చేసి పరిస్థితిని మార్చారు. పరేడ్ గ్రౌండ్ లో కేసీఆర్ ప్రసంగం 20 నిమిషాలలోపే ముగిసింది. మేనిఫెస్టో విడుదల చేసినా… మేనిఫెస్టోలో హామీలను సభలో ప్రస్తావించలేదు. కానీ.. కొన్ని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారు. అన్ని రకాల పెన్షన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కి పెంపు, వికలాంగుల పెన్షన్లు రూ.3016కు పెంపు, వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 57 ఏళ్లకు కుదింపు, నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి, సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు సాయం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు 61కి పెంపు, రైతులకు రూ. లక్ష వరకు రుణాలు మాఫీ, రెడ్డి, వైశ్య కార్పొరేషన్లతో పాటు ఇతర వర్గాలకు కార్పొరేషన్లు వంటి హామీలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తాను ప్రతిపక్షంలో ఉన్నట్లుగా… కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నట్లు భావించి ఎన్నికల ప్రచారాన్ని ఆ దిశగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నగరం విధ్వంసానికి గురైందన్నారు. రాజ్‌భవన్, అసెంబ్లీ ముందు కూడా నీళ్లు నిలిచే పరిస్థితి ఉందని.. మార్కెట్లు, టాయిలెట్లు కూడా లేవన్నారు. కచ్చితంగా ఇవే విమర్శలు నాలుగేళ్ల ముందు.. గత పాలకులపై చేసిన కేసీఆర్.. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానంటూ మాటిచ్చారు. కానీ మళ్లీ ఎన్నికలు వచ్చేసరి అవే విమర్శలు చేసి.. వాటినే కారణాలుగా చూపించి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన ఘనతగా చెప్పుకుంటున్న కరెంట్ విషయంలో మాత్రం.. కోతలు లేవని.. గొప్పలుగా చెప్పుకున్నారు. సర్వేలు వ్యతిరేకంగా వస్తాయన్న విషయాన్ని కూడా కేసీఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇవాళో, రేపో ఓ డూప్లికేట్ సర్వే కూడా విడుదల చేస్తారని.. నమ్మవద్దని.. 100కు పైగా సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని ప్రకటించారు.