ముందస్తు ఎన్నికలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా.. అని విపక్షాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ చేస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు సహజమే. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలసి వచ్చిన తర్వాత ఈ సవాల్ చేయడంతో.. కేసీఆర్కు ముందస్తు ఎన్నికలపై ఖచ్చితమైన సమాచారం వచ్చి ఉంటుందని చాలా మంది అనుమానం. నిజానికి ఇది ఎన్నికల సంవత్సరం. ఏడాదిలోపే అసెంబ్లీ, పార్లమెంట్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు పిలుపునిస్తున్నారు..?. దీనికి కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రైతు బంధు పథకంతో ఓట్ల కొనుగోలు..!
ఇటీవల కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఒక విడత నగదు పంపిణి దాదాపుగా పూర్తయింది. ఎన్నికలలోగా రెండో విడత కూడా పంపిణీని పూర్తి చేస్తారు. అంటే రూ. 12 వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో రైతులు, భూ యజమానులకు అందుతున్నాయి. అంటే… రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా రూ. 12వేల కోట్లు ఓటర్లకు అందాయన్నమాట. సాధారణం ఎన్నికల సమయంలో పార్టీలు ఓటుకు రూ. వెయ్యి, రెండు వేలు పంపిణీ చేస్తూంటాయి. కానీ కేసీఆర్ దీనికి భిన్నంగా ఆలోచించారు. చట్టరీత్యా… తెలంగాణ బడ్జెట్ నుంచే.. ఓటర్లకు నగదు పంపిణీ చేశారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే… దేశ చరిత్రలో ఇలాంటి ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదు. ఎన్నికల ఏడాదిలోనే ఇంత భారీగా ఎందుకు పంపిణీ చేస్తున్నారు…? 2014లో అధికారం చేపట్టినప్పుడో.. ఆ తర్వాతి ఏడాది నుంచో.. ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే.. ఈ క్వశ్చన్ రాదు. ఎన్నికల ఏడాదిలోనే రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 12 వేల కోట్లు రైతులకు వెళ్లాయి. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా ఎన్నికలపై ఉంటుంది. దీన్ని ఊహించే కేసీఆర్ ఎన్నికల ఏడాదిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వాన్ని దింపేయాలన్నంత వ్యతిరేకత ప్రజల్లో లేదు..!
ఇప్పటికిప్పుడు…చూసుకున్నా తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకతపై పెద్ద ఎత్తున లేదు. కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది ..కానీ తీవ్ర స్థాయిలో లేదు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రైతుల్లో ఆందోళన ఉంది. పెట్టుబడి సాయం అందిందని రైతులు సంతోషపడతారు. కానీ గిట్టుబటు ధర రాకపోతే మాత్రం తీవ్ర అసంతృప్తికి గురవుతారు. అందుకే పంటలు అమ్ముకునే సమయానికి కన్నా ముందే ఎన్నికలు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. వచ్చే మే నెలలో ఎన్నికలు జరిగాయనుకుందాం. అప్పటికి.. పంటలు మార్కెట్లోకి వస్తాయి. గిట్టుబాటు ధరలు లేకపోతే.. పెట్టుబడి సాయం అందించిన ప్లస్ కన్నా… ఈ గిట్టుబాటు ధరలు దక్కలేనే ఆగ్రహం రైతుల్లో ఎక్కువ ఉంటుంది. ఆ పరిస్థితి రాక ముందే ఎన్నికలను కేసీఆర్ కోరుకుంటున్నారనుకోవచ్చు. ఇదే కాదు..మరికొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది.కౌలు రైతులు, పట్టాల్లేని రైతులు, గిరిజన రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వీరిలో అసంతృప్తి ఉంది. అయితే ఇది తీవ్రంగా లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలనే కోరిక మాత్రం ప్రజల్లో లేదు.
కేసీఆర్ను ఢీకొట్టే నేత లేరు..!
కేసీఆర్ నాయకత్వం టీఆర్ఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్. కేసీఆర్ స్థాయిలో ఇతర పార్టీల్లో నాయకత్వం వహించే నేతలు లేరు. ఇది టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్. దీనితో పాటు ఆపరేషన్ ఆకర్ష్ తో తెలుగుదేశాన్ని ఇప్పటికి దాదాపుగా లేకుండా చేశారు. తెలంగాణలో సెటిలైన సీమాంధ్ర ఓటర్లు 20 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని నిర్ణయించే స్థితిలో ఉన్నారు. ఒక వేళ టీడీపీ ఇంతో ఇంతో బలంగా ఉంటే.. వీరంతా టీడీపీ వైపే ఉండే అవకాశం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ దాదాపుగా లేదనే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ ఇంపాక్ట్ కూడా టీఆర్ఎస్ పై ఉంటుందని కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారు. దీంతో పాటు ఎంఐఎంతో స్నేహం వల్ల ముస్లిం ఓట్లు కూడా కలసి వస్తాయని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు.
ఎవరికి వారే అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు..!
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఓ యాత్ర చేయాలంటే.. ఎవరికి వారే అన్నట్లు ఉంటారు. పార్టీ పదవుల్ని కూడా ఈ విబేధాల వల్ల పూర్తిగా భర్తీ చేయలేకపోయారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు కలసి కట్టుగా పోరాడే పరిస్థితిలో లేదు.ఎన్నికలకు సమాయత్తమయ్యే పరిస్థితిలో లేదు. టీడీపీ, వామపక్షాలు కూడా బలహీనంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్కలేసుకున్న తర్వాతనే.. కేసీఆర్ ముందస్తు ఆలోచన చేస్తున్నారు. ఇంకా సమయం ఇస్తే టీడీపీ, కాంగ్రెస్ బలపడే ప్రయత్నం చేస్తాయి. విపక్షాలు ఐక్యతకు రాక ముందే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. అన్నీ బలం కూడదీసుకోక ముందే కొట్టేయాలన్నది కేసీఆర్ స్ట్రాటజీ కావొచ్చు.
నేతలకు టిక్కెట్ల సర్దుబాటే కేసీఆర్కు అసలైన సవాల్..!
టీఆర్ఎస్ కు ఉన్న ముఖ్యమైన సవాల్ .. అతిగా పార్టీలోకి వచ్చి చేరిన నేతలు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అన్ని పార్టీల నేతలును కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. విభజన చట్టంలో ఉన్నట్లుగా… అసెంబ్లీ సీట్లు పెరిగితే అందరికీ సర్దుబాటు చేద్దామనుకున్నారు కేసీఆర్ కానీ..డీలిమిటేషన్ కు కేంద్రం అంగీకరించలేదు. ఇప్పుడు పాత, కొత్త నేతలందరికీ… కేసీఆర్ సీట్లు సర్దుబాటు చేయాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 90 శాతం మందికి టిక్కెట్లిస్తానని కేసీఆర్ చెబుతున్నారు. అంటే.. ఉన్న వాళ్లందరికీ.. టిక్కెట్లివ్వాలి.. కొత్తగా వచ్చిన వారికీ సర్దుబాటు చేయాలి. అప్పుడే సమస్యలు వస్తాయి.అందరికీ అవకాశం కల్పించలేదు. ఎన్నికల సమయం వచ్చే సరికి వారందర్నీ ఎలా సంతృప్తి పరచాలనేది కేసీఆర్ కు సవాల్ గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీ కాకుండా మిగతా పక్షాల్ననీ ఏకమైతే కాస్త గడ్డు పరిస్థితే. ఎందుకంటే.. తెలంగాణ తెచ్చిన ఇమేజ్ ఉన్నా.. 2014లో టీఆర్ఎస్ కు అరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి ఏకమైతే ఇబ్బందికర పరిస్థితులు రావొచ్చు. ఈ సమస్యలన్నీ ఒకే సారి రాక ముందే కేసీఆర్ ముందస్త ఎన్నికలకు పిలుపునిచ్చారని భావించవచ్చు.