ఎన్నికలు అయిపోయాక గెలిచినా, ఓడినా ఫ్యాక్షన్ ప్రారంభిస్తానని తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎన్నికలు అయిపోయాక ఆయన ఫ్యాక్షన్ ప్రారంభించలేదు కానీ నా అన్నను చంపినట్లుగా నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఏడ్చేందుకు సిద్దమయ్యారు. అధికారం చేతుల్లో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాజకీయం చేసి.. నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి రెచ్చగొట్టిన ఆయన ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టలేకపోతున్నారు.
తాడిపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయన తాడిపత్రిలోకి వెళ్తే ఎదురయ్యే పరిస్థితుల్ని చక్కదిద్దలేమని చెబుతున్నారు. అయితే పెద్దారెడ్డి మాత్రం తన ఊరికి తనను పోనివ్వరా అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరికీ స్వేచ్చ ఇచ్చి ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. ఆయన ఇష్టా రీతిన వ్యవహిరంచి అందరిపై దాడులు చేయించడంతోనే సమస్య వచ్చింది.
గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చంపినా సరే..తాను తాడిపత్రి దాటి పోనని చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు పెద్దారెడ్డి మాత్రం తనను చంపేందుకు ప్రభాకర్ రెడ్డి ప్లాన్ చేస్తన్నారని గతంలో తన అన్నను చంపారని ఆయన ఆరోపిస్తున్నారు. తనను చంపేందుకు ఎస్పీ కూడా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గెలిచినా ఓడిపోయినా ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఇలా అయిపోయారేంటని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.