పార్టీ బలంతో పదవులు పొంది ఎప్పుడైతే తమ బలంతోనే తాము ఎదిగామని నేతలు అనుకుంటారో.. అప్పుడే వారిని దూరం పెట్టేయాలి. లేకపోతే వారు ఎంతకైనా తెగిస్తారు. దానికి టీడీపీలో తాజా ఉదాహరణగా కేశినేని నాని నిలుస్తున్నారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి ఆయన ఇతర ఎంపీలతో పాటు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ బోకే ఇవ్వడానికి మాత్రం ఆయన నిరాకరించారు. విసిరికొట్టినంత పనిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇతర పార్టీలు ట్రోల్ చేస్తున్నాయి.
ఇలాంటి ప్రవర్తన ఏ ఇతర పార్ట ఎంపీ.. తమ అధ్యక్షుడితో చేసే సాహసం చేయరు. కానీ ఇక్కడ చంద్రబాబు కేశినేని నాని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా.. చూసీచూడనట్లుగా ఉన్నారు కాబట్టే ఇక్కడ వరకూ వచ్చింది. పైగా ఇటీవల కేశినేని నాని కుమార్తె వివాహ నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులందరితో హాజరయ్యారు. సొంత కుటుంబ కార్యక్రమం అన్నట్లుగా లోకేష్.. ఇతర టీడీపీ నేతలు సందడి చేశారు.
అంతకు ముందే మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసినప్పుడు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. వాటిని ఆయనఖండించలేదు. అయినప్పటికీ చంద్రబాబు తమ కుటుబంంలో శుభకార్యం అన్నట్లుగా వెళ్లారు. అలాంటి అలుసు ఇవ్వడంతో ఇప్పుడు కావాలనే అసహనం ప్రదర్శించారు. ఇలాంటి నేతల్ని టీడీపీలో పెట్టుకుని చంద్రబాబు సాధించేదేమీ ఉండదని.. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పంపేయడం బెటరని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సలహాలిస్తున్నారు.