రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఎప్పుడు, ఎవరికి, ఎంత రుణమాఫీ అవుతుందో… గ్రామాల వారీగా రైతుల పేర్లు పెట్టి మరీ లిస్ట్ విడుదల చేసింది. ఒక్క కుటుంబంలో ఒకరికి రుణమాఫీ వర్తిస్తుందని… మహిళల పేర్లతో అప్పుంటే వారికే వర్తిస్తుందని తెలిపింది.
కానీ, అవి రైతుబంధు పైసలు… అవేలా రుణమాఫీ చేస్తారు అన్నది బీఆర్ఎస్ వాదన. రైతుబంధు ఆపి, రుణమాఫీ చేస్తున్నారు అంటూ కేటీఆర్ సైతం విమర్శలు స్టార్ట్ చేశారు.
నిజానికి రైతు రుణమాఫీ విషయంలో గతంలో కేసీఆర్ సర్కార్ తీవ్ర విమర్శల పాలయ్యారు. లక్ష రుణమాఫీ కూడా ఏడాదికి 25వేల చొప్పున నాలుగుసార్లు చేస్తాం అని, అదనపు వడ్డీతో సంబంధం లేదని నానా కండీషన్లు పెట్టారు. రైతులంతా తిట్టిపోశారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఏకకాలంలో మాఫీ చేస్తోంది. అవి రైతుబంధు డబ్బులా… ఇంకో అప్పా తర్వాత విషయం. రైతును అప్పు నుండి విముక్తి చేయటం ముఖ్యం.
పోనీ రైతుబంధు డబ్బులే అనుకున్నా… మేం ప్లాట్లకు, వ్యవసాయం చేయని భూమికి, బడా భూస్వాములకు ఇవ్వము అని రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా చెప్పింది. ఈ నెలలో అసెంబ్లీ ఉంది… అందులో చెప్పి, రైతుబంధు విడుదల చేస్తాం అని చెప్పింది. చెప్పిన వారికి రైతుబంధు చేయక తప్పుదు. మరో నిధి నుండి డైవర్ట్ చేస్తారా, అప్పు చేస్తారా తర్వాత సంగతి. రైతుబంధును ఇవ్వాల్సి వస్తుంది. అంటే రైతుబంధు నిధుల విడుదల, అర్హుల గుర్తింపు వరకు వాయిదానే తప్పా ఎగవేత కాదు. పైగా, భూస్వాములకు ఇవ్వొద్దన్న డిమాండ్ కేసీఆర్ హయాం నుండి ఉన్నా… ఆయనకు పట్టలేదు. రేవంత్ సర్కార్ ఆచరణలో పెడుతుంది అంతే. దీన్ని స్వాగతిస్తారే తప్పా ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదు.
ఇవన్నీ మరిచిపోయి కేటీఆర్, బీఆర్ఎస్ లు… రుణమాఫీ అయ్యే సమయంలో అవి రైతబంధు పైసలు దీనికి ఇస్తున్నారని వాదించటం వారికే చేటు చేస్తుందంటున్నారు విశ్లేషకులు. రైతుకు రుణమాఫీ కావాలి కానీ ఏ డబ్బులు అయితే ఏంటీ? పోనీ సామాన్య రైతుకు రుణమాఫీ వచ్చింది కాబట్టి రైతుబంధు ఇవ్వము అని ఎవరూ చెప్పలేదు… కాస్త ఆలస్యంగా అవి కూడా ఇస్తున్నప్పుడు ఇంత రాద్ధాంతం బీఆర్ఎస్ కే మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.