పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదు. అభ్యర్థులను పిలిచి వారికి భవిష్యత్ పై భరోసా కల్పించాల్సిన కేటీఆర్ ఆ పని చేయకపోగా, అసలు ఎవరికీ కనిపించకుండా పోవడం చర్చనీయాంశం అవుతోంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో ఎమ్మెల్యేలు , కీలక నేతలు పార్టీని వీడెందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాక్టివ్ గా వ్యవహరిస్తూ నేతలను పార్టీ చేజారిపోకుండా చూడాల్సింది కానీ, కేటీఆర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుండటం పార్టీలో విమర్శలకు తావిస్తోంది. కేటీఆర్ వైఖరిపై విసిగిన కొంతమంది బహిరంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ లు కూడా చేస్తున్నారు.
అటు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా కనిపించే కేటీఆర్ సోషల్ మీడియాలోనూ స్పందించడం లేదు. దీంతో కేటీఆర్ సైలెన్స్ ఎందుకు అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ నిరాశ పరచడంతో అవమానభారంతోనే మౌనం వహిస్తున్నారా..? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీరాలు పలికినా ఫలితాలు ప్రతికూలంగా రావడంతో నేతలకు మొహం చూపించలేకపోతున్నారా..? అని బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
కొన్ని రోజులుగా కేటీఆర్ తెలంగాణ భవన్ కు రావడం మానేశారు. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో ఆయన విదేశాలకు వెళ్ళారా..? అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ , గొర్రెల స్కామ్ , కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, విద్యుత్ కొనుగోళ్ళు , ఒప్పందాలలో బీఆర్ఎస్ పెద్దలకు చిక్కులు తప్పవనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ సైలెన్స్ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.