తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గొప్పవాడిని చేయడానికి … జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా…కొత్త కొత్త స్కిట్లు ప్రదర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు..తన తండ్రితో పోల్చుకుని… జగన్ కంటే.. తండ్రి ఎంతో మేలు అనుకునేలా చేస్తున్నారు. పార్టీ నేతలో వ్యవవహరించే విధానంలో.. ఇది కొత్త ఎత్తులకు చేరుకుంది. పార్టీలో ఉన్న ఏ ఒక్కరూ కూడా.. ఆయనలో వైఎస్‌ను చూడలేకపోతున్నారు. చాలా మంది వైఎస్ సన్నిహితులు.. ఇప్పటికే జగన్‌కు దూరం జరిగారు. ఒకప్పుడు వైఎస్‌ను అత్యంత దారుణంగా దూషించిన వారు మాత్రమే జగన్‌కు దగ్గరగా ఉన్నారు.
అవసరం లేని నేతలు కరివేపాకులా..?
ఓ పూతలపట్టు సునీల్ కావొచ్చు… మరో యడం బాలాజీ కావొచ్చు.. ఎవరైనా… వైసీపీకి అవసరం లేదంటే.. కరివేపాకులే. ఇంత కాలం పార్టీ కోసం పని చేశారన్న కనీస సానుభూతి కూడా.. జగన్ చూపించరు. పక్క పార్టీల నుంచి ఎవరైనా వస్తే.. వారిని పార్టీలో చేర్చేసుకుని.. ఏకంగా టిక్కెట్ ఖరారు చేస్తున్నారు. ఇంత కాలం పార్టీని నమ్ముకున్న వారికి కనీసం సమాచారం ఇచ్చి.. భవిష్యత్‌లో న్యాయం చేస్తామన్న.. కనీసం ఊరడి మాటలు కూడా చెప్పడం లేదు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అదే వైఎస్ ఎవరికైనా టిక్కెట్ నిరాకరించాలంటే.. ముందుగా వారికి సర్ది చెబుతారు. పరిస్థితులు వివరిస్తారు. నేనున్నానని భరోసా ఇస్తారు. అప్పుడు.. టిక్కెట్ ఇవ్వకపోయినా… ఆ నేత.. తనకు నాయకుని భరోసా ఉందన్న సంతృప్తితో ఉండేవారు. కానీ.. జగన్ మాత్రం.. ఆ లీడర్ అవసరం లేదనుకుంటే.. మొహం మీదే… తలుపేస్తున్నారు. పూతలపట్టు సునీల్ విషయంలో అదే జరిగింది.
అందర్నీ ఆదరించబట్టే వైఎస్ అభిమాన నేత అయ్యారు…!
నేను వదిలేస్తే గాలికిపోతావు, ఈ పార్టీ నాది నా ఇష్టం, వచ్చేటప్పుడు చెప్పులు విడిచేసి రా, మేకప్‌తో రామాకు, కళ్లు జోడు పెట్టుకోకు… సొంత పార్టీ నేతలకు ఇలాంటి హెచ్చరికలు చేసే వారిని ఏమంటారు..? బయట ఏమంటారో కానీ.. ఏపీలో మాత్రం జగన్ అనాలి. ఆయన ప్రవర్తనపై.. ఇప్పటికే రకరకాల ప్రచారాలు ఉన్నాయి. దశాబ్దాల పాటు… రాజకీయాల్లో ఉండి.. ఎన్నో పదవులు అలంకరించిన వారు కూడా… జగన్ ను సార్ అంటే తప్ప.. ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి. అందుకే… జగన్మోహన్ రెడ్డి… మైండ్‌గేమ్‌లు ఆడి.. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారి కోసం.. ప్రయత్నించాల్సి వస్తోంది. ఈ విషయంలో.. వైఎస్ నుంచి… జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నది ఒక్క శాతం కూడా లేదు. వైఎస్… ప్రత్యర్థుల్ని కూడా గౌరవించేవారు. ఇక సొంత పార్టీ నేతల్ని ఎందుకు కించ పరుస్తారు.. ? పార్టీ నేతలు ఎవరైనా లైన్ తప్పితే.. మంచి మాటలతోనే… వారిని హెచ్చరించేవారు. కానీ జగన్ మాత్రం… ఇగోతో.. మొత్తానికే నేతల్ని దూరం చేసుకుంటున్నారు.
వైఎస్‌ను అభిమానించేవారు జగన్ వెంట ఎందుకు ఉండటం లేదు..?
కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌కు అభిమానిస్తూ.. ఆయన సొంత వర్గంగా చెలామణి అయిన వారిలో.. ఇప్పుడు పట్టుమని పది మంది కూడా.. జగన్మోహన్ రెడ్డి వెంట లేరు. కుటుంబసభ్యులుగా భావించిన గౌరు వెంకటరెడ్డి కుటుంబాన్ని కూడా జగన్ దూరం చేసుకోవడం దీనికి నిదర్శనం. పితాని సత్యనారాయణ లాంటి వారిని ఇప్పుడు.. వైఎస్ సెంటిమెంట్‌తో… పార్టీలోకి చేర్చుకునేందుకు.. జగన్ పడుతున్న తంటాలు అందరూ చూస్తున్నారు. ఏ జిల్లాలోనూ.. వైఎస్ సన్నిహితులు.. ఇప్పుడు జగన్ వెంట లేరు. ఉన్నదల్లా బొత్స సత్యనారాయణ, ధర్మాస ప్రసాదారవు. పార్టీలో వారికి లభిస్తున్న గౌరవం చూసి చాలా మంది… ఆగిపోతున్నారు.
ఏ విధంగా చూసినా… వైఎస్ రాజశేఖర్ రెడ్డిలోని నాయకత్వ లక్షణాలు.. జగన్మోహన్ రెడ్డికి ఒక్కటంటే.. ఒక్కటీ రాలేదు. ఆయనది సెపరేట్ పొలిటికల్ బ్రీడ్.