మీడియా అంటే కొన్ని భాషా ప్రమాణాలు ఉంటాయి. రాసే వాటిలోనే కాదు చూయించే వాటిలోనూ కొన్ని స్టాండర్డ్స్ మెయిన్ చేయడం తమ నైతికత అని భావిస్తాయి. కానీ ఇప్పుడు ఏ నైతికతలూ లేవు. ఓ రాజకీయ నాయకుడ్ని మరో నాయకుడో నాయకురాలో బండబూతులు పెడితే… పంచ్ అని చెప్పి పదే పదే చూపించే దౌర్భాగ్యమైన జర్నలిజానికి వచ్చేశాం. రాజకీయాలకు సంబంధం లేని ఓ ప్రముఖ వ్యక్తి జీవితంపై రాజకీయ నేత ఘోరంగా మాట్లాడితే అంతకు మించిన వీడియో దొరకదని కొన్ని చానళ్లు పదే పదే ప్రసారం చేశాయి. అదేలా నైతికత అని సమర్థించుకుంటాయో కానీ.. చూసే వాళ్లకు కూడా ఆమె అంటే అన్నది ఇన్ని సార్లు ఎందుకు చూపించాలన్న ప్రశ్న మాత్రం చూసే వారికైనా వస్తుంది.
మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో చిక్కిన తర్వాత… వ్యూస్, రేటింగ్ల మాయల్లోకి జారిపోయిన తరవాత.. ఒకటే ప్రామాణికం పెట్టుకుంటున్నారు తప్ప నైతికత జోలికి వెళ్లడం లేదు. తమ అభిమాన పార్టీకి చెందిన నేత ఇవాళ బూతులు తిడతాడు… పూర్తి స్థాయి లైవ్ కవరేజీ ఇవ్వాలని ఆదేశాలు వస్తే… పాటించేస్తారు. వైసీపీ హయాంలో బూతులు మాట్లాడే ప్రతి ఒక్క నేత లైవ్ మొదటి నుంచి చివరి వరకూ రెండు అగ్ర టీవీ చానళ్లలో వచ్చేది. పోసాని లాంటి వాళ్లు మాట్లాడితే ఇప్పుడు కూడా లైవ్ ఇస్తున్నారు. వారు ఘోరమైన భాష మాట్లాడతారని తెలిసినా.. లైవ్ లో చూపించేసి తమ బాధ్యత నెరవేర్చుకుంటున్నారు. వేరే వాళ్ల అహన్ని చల్లారుస్తున్నారు. మరి మీడియా విలువల మాటేంటి?
కొండాసురేఖ చేసిన వ్యాఖ్యల్నిప్రసారం చేయడమే తప్పని జర్నలిజాన్ని జర్నలిజంలా చూసే వారికి అర్థమవుతుంది అది పదే పదే చూపించడం అంటే… సంబంధం లేని వాళ్లను ఇబ్బందిపెట్టడమే. బూతులు మాట్లాడే నేతల్ని మీడియా నిషేధిస్తే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదు. కానీ మీడియా రాజకీయాల్లో భాగం అయిపోయాక… అలాంటి సంస్కృతి పెంచి పోషించడానికి కారణం అవుతోంది కానీ తగ్గించడానికి కాదు. పడిపోతున్న ప్రమాణాలను నిలుపుకోవడం మీడియా చేతుల్లోనే ఉంది.