ఏం హాలత్ అయిపోయింది.. వైసీపీ పెద్దలకు. మోదీ పర్యటన ఖరారయింది. ఐదుప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడానికి ఓ సభ పెట్టాలని సమాచారం వచ్చింది. అంతే.. మోదీని మచ్చిక చేసుకోవడానికి ఇంతకు మించిన చాన్స్ దొరకదనుకున్నారేమో కానీ.. జూలు విదిలిచ్చారు. భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి మూడు లక్షల మందిని సమీకరించి మోదీనే ఆశ్చర్యపోయేలా చేయాలనుకున్నారు. విజయసాయిరెడ్డి .. ప్రత్యేకంగా జన సమీకరణ కోసం ఓ యాప్ తయారు చేయించి.. పార్టీ నేతలతో ఇన్ స్టాల్ చేయించి.. జన సమీకరణను ట్రాక్ చేశారు. ఇంతా చేస్తే.. మోదీ కనీసం.. ఏపీ ప్రభుత్వం గురించి కానీ.. ఏపీ సీఎం గురించి కానీ.., ఏపీ ప్రభుత్వ పథకాల గురించి కానీ ఒక్క మాట ప్రశంసాపూర్వకంగా మాట్లాడలేదు. అసలు అలాంటి ప్రస్తావనే తీసుకు రాలేదు.
మోదీ ప్రసంగం మొత్తం పూర్తిగా వన్ సైడ్ సాగిపోయింది. తమ పాలన.. తమ పనులు.. తమ అభివృద్ధి.. తమ నేతల కష్టం గురించి చెప్పుకున్నారు. అంతే కానీ.. ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన జగన్ కు కృతజ్ఞతలు అని చెప్పలేదు. ప్రజాధనంతో పాటు పార్టీ క్యాడర్తోనూ కోట్లు ఖర్చు పెట్టించిన విజయసాయిరెడ్డికి అసలు వేదికపై చోటు దక్కలేదు. మోదీనే కాదు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదు. ఏపీలో అభివృద్ధి జరుగుతోందని చెప్పలేదు. మోదీ ప్రసంగంలో అసలు జగన్ మాట కానీ.. ఏపీ ప్రభుత్వం ప్రస్తావన కూడా రాలేదు. దీంతో వైసీపీ నేతలు హతాశులయ్యారు.
ప్రభుత్వాన్ని లేదా జగన్ను ప్రశంసించినా.., ప్రశంసించినట్లుగా కనిపించినా సరే చిలువలు.. పలువలు చేసుకోవడానికి సిద్దమయ్యారు.. కానీ మోదీ అలాంటి చాన్స్ ఇవ్వలేదు. ఈ మొత్తం బహిరంగసభ ను చూస్తే… బీజేపీకి పెద్ద ఎత్తున డబ్బులు మిగిల్చి .. ప్రజా ధనం ఖర్చు పెట్టించి..సభను నిర్వహింపచేశారు కానీ..మోదీని మాత్రం మెప్పించలేకపోయారని స్పష్టమవుతోంది. ఆయన ప్రశంస కూడా ఇవ్వలేదంటే.. ఈ వైసీపీ నేతలు ఉత్తినే ఈ ఏర్పాట్లు చేయలేదని.. ఇంకేదో ఆశిస్తున్నారని ఆయనకు అర్థమైపోయి ఉంటుందని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఖర్చు మిగిలింది.. ఫలితమూ దక్కలేదని వైసీపీ నేతలు కిందామీదా పడాల్సిన పరిస్థితి.