ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ.. ప్రజలపై తాము పెట్టిన భారం.. కేంద్ర ప్రభుత్వానికి భారంగా కనిపిస్తోంది. జీఎస్టీ పేరుతో ప్రజలకు పెట్టిన వాతలు .. ఇప్పుడు తమకు ఓట్ల రూపంలో తిరిగి ఇస్తారన్న ఆందోళన ప్రారంభం కావడంతో.. వెంటనే.. వాటిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. జీఎస్టీ విషయంలో హడావుడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. ఇకపై విలాస వస్తువులు మాత్రమే 28 శాతం పన్ను పరిథిలో ఉండేలా నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. 28 శాతం జీఎస్టీ పరిథిలో 34 వస్తువులు మాత్రమే ఉంటాయి.
మానిటర్లు, టెలివిజన్ స్క్రీన్స్, టైర్లు, లిథియం-అయాన్ బ్యాటరీలతో కూడిన పవర్ బ్యాంకులపై పన్ను తగ్గుతుంది. వీటిని 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిథిలోకి తీసుకొచ్చారు. వికలాంగుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాలకు ఉపయోగించే విడి భాగాలపై పన్నును 5 శాతానికి తగ్గించారు. సినిమా టిక్కెట్ల ధరను బట్టి పన్ను తగ్గించారు. టికెట్ ధర రూ.100 వరకు ఉంటే 12 శాతం జీఎస్టీ విధిస్తారని, టికెట్ ధర రూ.100కుపైగా ఉంటే పన్ను 18 శాతం విధిస్తారు. ఈ పన్ను ఇప్పటి వరకు 28 శాతం ఉండి. జీఎస్టీ మండలి తాజా నిర్ణయాల ప్రకారం 33 వస్తువులపై పన్ను తగ్గింది. సామాన్యులు వినియోగించే వస్తువులపై 18 శాతం నుంచి 12 శాతం, 5 శాతం పన్నును మాత్రమే విధించాలని నిర్ణయించారు.
గతంలో జీఎస్టీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు.. ఆడవాళ్ల నేప్ కిన్లపై కూడా.. 18 శాతం పన్ను విధించారు. అప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలువచ్చాయి. సెలబ్రిటీలు కూడా.. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఓ ఉద్యమం నడిపారు. అయినప్పటికీ.. కేంద్రం చలించలేదు. ఆ తర్వాత తమ అధికార హవా తగ్గుతోందని.. తేలిన తర్వాత పన్ను తగ్గించారు. ఇప్పుడు మరీ తేడా కొడుతూండటంతో మరింత తగ్గారు.ఎన్నికల్లోపు మరోసారి సమావేశమై.. మరిన్ని తగ్గింపు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తాము అధికారంలోకి రాగానే.. జీఎస్టీ పన్ను శ్లాబుల్ని సవరిస్తామని.. రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. దాన్ని ముందే చేసేస్తోంది మోడీ ప్రభుత్వం.