దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ గెలుస్తుందనే కదనోత్సాహంతో భాజపా నేతలు ఈ మధ్య ప్రకటనలు చేస్తుండేవారు. 2014లో దేశం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటే, ఆ తరువాత రాష్ట్రాల్లో కూడా భాజపా అధికారంలో ఉండాలని ప్రజలు గెలిపిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాజపా ఉంటేనే అభివృద్ధి అన్నట్టు ఒక థియరీ చెప్పేవారు! ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఇతర పార్టీల కంటే ముందుగానే భాజపా వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యేది. కానీ, వచ్చే నవంబర్ లో జరగాల్సి ఉన్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ మీనమేషాలు లెక్కిస్తున్నట్టు సమాచారం!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గడ్ అసెంబ్లీలకు నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఈ ఎన్నికల్ని ఎలాగైనా వాయిదా వెయ్యాలన్న ఆలోచనలో మోడీ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల కథనం. అయితే, మోడీ అనుకున్నంత మాత్రాన ఎన్నికలు వాయిదా వేయడం సాధ్యమా… అంటే, కాదనే చెప్పాలి. పదవీ కాలం పూర్తయిన వెంటనే, అసెంబ్లీ రద్దవుతుంది. ఆ తరువాత ఎన్నికలను ముందు జరపాలా, వాయిదా వేయాలా అనేది కేంద్రంలో అధికార పార్టీ నిర్ణయించలేదు. అసాధారణ పరిస్థితులు,అంటే ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే తప్ప ఎన్నికలు వాయిదా వేసే వెసులుబాటు రాజ్యాంగం కల్పించలేదని నిపుణులు అంటున్నారు. నవంబర్ తో పూర్తవుతున్న అసెంబ్లీల ఎన్నికల్ని ఎప్పుడో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ వాయిదా వెయ్యాలంటే సహేతుకమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి కారణాలను వెతుక్కునే పనిలోనే మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో నిపుణులు ఉన్నారట. వచ్చే నెల తొలివారంలో ఆర్డినెన్సు తీసుకొచ్చే అవకాశం ఉందనీ కథనాలు వస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల తరువాత భాజపాలో ఎన్నికల ఉత్సాహం తగ్గింది. కారణం.. మోడీపై వ్యక్తమౌతున్న వ్యతిరేకత. ఇప్పుడీ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భాజపాకి ఏమాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇంతవరకూ భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎన్నికలే జరిగాయి. కాబట్టి, భాజపా వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడీ రాష్ట్రాల్లో భాజపాపై సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమౌతుంది, దాన్ని లోక్ సభ ఎన్నికల ముందు ఎదుర్కొనేందుకు భాజపా సంకోచిస్తోంది. కారణం.. ఫలితాలపై వారికే నమ్మకం లేకపోవడం. అలాగని, ఎన్నికల్ని ఏప్రిల్ వరకూ వాయిదా వేసి… లోక్ సభతో కలిపి నిర్వహించడం కూడా భాజపాకి సవాలే. ఎందుకంటే, రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకతతోపాటు, జాతీయ స్థాయిలో ఉన్న మోడీ వ్యతిరేకతకు కూడా ఎదురెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా, ఎన్నికలు అనగానే ఏదో ఒకటి చేసేసి గెలిచేద్దామనే ఉత్సాహం ఇప్పుడు భాజపాలో తగ్గడం గమనించదగ్గ విషయం.