మాజీ మంత్రి మరియు మాజీ కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గత కొద్ది సంవత్సరాలు గా వేసుకున్న ముసుగు ని త్వరలోనే తొలగించనున్నట్లు గత రెండు రోజులు గా రాజకీయ వర్గాల లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే…
గతం లో చంద్ర బాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని చేపట్టి, ప్రభుత్వం పై పోరాడి, సరిగ్గా ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను అని బాహాటంగా ప్రకటించిన జగన్ కి మద్దతు ఇవ్వడమే కాకుండా, జగన్ అధికారం లోకి రాగానే తాను కాపు ఉద్యమాన్ని వదిలేస్తున్నట్లు అధికారికంగా ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం పై పోరాడుతున్నపుడు తనకు వైఎస్ఆర్సిపి అధినేత జగన్ తో కానీ ఆ పార్టీతో కానీ ఎటువంటి సంబంధం లేదు అని పదే పదే నొక్కి వక్కాణించిన ముద్రగడ పద్మనాభం చాలా సంవత్సరాల పాటు పార్టీలకు అతీతంగా కాపుల హక్కుల కోసం పోరాడుతున్నట్లు కాపు యువతనే కాకుండా ఇతర జనాలను కూడా నమ్మించగలిగారు.
2019 తర్వాత కొద్ది కొద్దిగా క్రెడిబిలిటీని కోల్పోతున్న ముద్రగడ పద్మనాభం:
అయితే ఇటీవల కాలంలో ఆయన ముసుగు కొద్ది కొద్దిగా తొలగుతూ వస్తోంది. జగన్ ముఖ్య మంత్రి కాగానే కాపుల హక్కుల గురించి ఒక్క నాడు కూడా ఆయనని ప్రశ్నించకపోవడం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాగానే కాపు ఉద్యమాన్ని అటకెక్కించడం తో కొంత వరకు క్రెడిబిలిటీ ని పోగొట్టుకున్న ముద్రగడ పద్మనాభం, ఇటీవల వైఎస్ఆర్సిపి నేత ద్వారంపూడి చంద్ర శేఖర రెడ్డి తనకు, తన ఉద్యమానికి గతం లో నిధులు సమకూర్చారని చెప్పి తన క్రెడిబిలిటీ ని పూర్తిగా ప్రజల్లో కోల్పోయారు. ఆయన చేసిన ఈ ప్రకటన కాపు యువత లో తీవ్ర స్థాయిలో అసహనాన్ని కలిగించింది. దీనికి తోడు కాపు సామాజిక వర్గానికి ప్రస్తుతం ఆశా కిరణం గా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వక పోగా, ఆయనకు వ్యతిరేకంగా ముద్రగడ వైఎస్ఆర్సిపి కి ప్రయోజనం కలిగించేలా పనిచే స్తున్నాడు అన్న ప్రచారం కూడా కాపు సామాజిక వర్గంలో ఆయన కి ఉన్న ఆదరణ ను బాగా తగ్గించింది. అయితే ఇంత కాలంగా తాను పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని చేస్తున్నట్లు ముసుగు వేసుకున్న ముద్రగడ ఇప్పుడు ఆ ముసుగు ను పూర్తిగా తీసి వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్సిపి లో అధికారికంగా చేరడానికి సన్నాహాలు:
గత కొంత కాలంగా, వైకాపా మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా మరి కొంత మంది వైఎస్ఆర్సిపి నేతలు ముద్రగడ పద్మనాభం తో చేస్తున్న చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం అధికారికంగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడానికి సన్నాహాలు గట్టి గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ స్థానానికి కానీ, తూర్పు గోదావరి జిల్లా లోని మరి ఏదైనా అసెంబ్లీ స్థానాని కి కానీ ముద్రగడ కు వైఎస్ఆర్సిపి టికెట్ లభించే అవకాశం ఉన్నట్లు జోరుగా రాజకీయ వర్గాల లో ప్రచారం జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం ని అధికారికంగా తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైఎస్ఆర్సిపి కి గత కొంత కాలంగా దూరమైన కాపు సామాజిక వర్గాన్ని తిరిగి తమ వైపు మళ్ళించుకోవచ్చు అని వైఎస్ఆర్సిపి గట్టిగా భావిస్తోంది. అయితే 2009లో ప్రజా రాజ్యం పార్టీ వచ్చిన కొత్త లో పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి అధికార కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం అంతటి రాజశేఖర్ రెడ్డి హవా లో కూడా మూడవ స్థానానికి పరిమితం కావడం, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత చేతిలో చిత్తుగా ఓడిపోవడాన్ని గుర్తు చేస్తూ ముద్రగడ పద్మనాభం వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మరి ముద్రగడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయన చేరిక వైఎస్ఆర్సిపి కి మేలు చేస్తుందా లేక మరింత నష్టం కలుగజేస్తుందా అన్న దాని పై కొంత కాలానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.