కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కాపులను వీలైనంత త్వరగా బీసీల్లో చేర్చాలంటూ మరోసారి డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈనెలంతా ఎదురుచూస్తామనీ, ఈలోగా కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుంటే ఫర్వాలేదనీ, లేదంటే ఈ నెలాఖరు నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు..! పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన కాపుల ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసమే తమ కులస్థులకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారనీ, ఆ తరువాత నాలుగేళ్లు అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇప్పటికే విద్యా ఉద్యోగావకాశాల్లో చాలా కోల్పోయామనీ, అందుకే వెంటనే రిజర్వేషన్లు వర్తించేలా చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్ లో ఉన్న మా జాతి న్యాయ కోవిదుల్ని సలహాలు తీసుకున్నాం. ఇచ్చిన రిజర్వేషన్లను తక్షణం అమలుచేయాలంటే ప్రభుత్వం మీద ఏ రకమైన ఒత్తిడి తేవాలన్నదానిపై వారితో చర్చించాం. రాష్ట్రపతి సంతకం కావాలంటే సంవత్సరాలు పట్టేస్తుంది కాబట్టి, ఇప్పుడు ఇచ్చిన విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలంటే గవర్నర్ సంతకంతో కూడా అమలు చెయ్యొచ్చని సలహా ఇచ్చారని’ ముద్రగడ అన్నారు. సర్వాధికారాలు ముఖ్యమంత్రికి ఉన్నాయనీ, కాబట్టి ఆయనపై వీలైనంత ఒత్తిడి చేయాలన్న నిర్ణయానికి వచ్చామని ముద్రగడ చెప్పారు.
కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, దానికి అనుగుణంగా ఆ మధ్య ఓ తీర్మానం ఆమోదించింది కూడా! అయితే, ఉద్యమనేతగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు ముద్రగడ ఎన్నైనా చెయ్యొచ్చు, ఎవ్వరూ కాదనరు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏంటీ..? రాష్ట్ర ప్రయోజనాలే సంకటంలో పడ్డాయి. విభజన హామీలని కేంద్ర ప్రభుత్వం తప్పుతున్న పరిస్థితి. దీంతో పార్టీలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో టీడీపీ ఉంటే… ఆ దిశగా ముద్రగడ మాట్లాడరేం..! మా జాతి ప్రయోజనాలే అంటున్నారు తప్ప, తెలుగు జాతి ప్రయోజనాలు గురించి కూడా మాట్లాడితే బాగుండేది కదా. ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగానే కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందనే ప్రయత్నాల్లో ఏపీ సర్కారు ఉంది. ఇలాంటప్పుడు, ఈ నెలలోపే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు ఉంటాయని ముద్రగడ అంటున్నారు. కనీసం ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకైనా ఆ కార్యక్రమాలేవో వాయిదా వేస్తున్నామనీ, ప్రభుత్వ పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నామనీ, ఆ తరువాత తమ జాతి ప్రయోజనాల కోసం పోరాడతామని ముదగ్రడ చెప్పి ఉంటే ఎంత బాగుండేది కదా!