చంద్రబాబు నాయుడు , 2014 మేనిఫెస్టోలో పెట్టిన కాపు రిజర్వేషన్ల అంశంపై ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మోడీ ఇటీవల చట్టం గా మార్చిన ‘అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్’ ని ఆధారంగా చేసుకుని, ఆ 10% లో ఐదు శాతాన్ని కాపులకు కేటాయిస్తానని, మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణాల లోని ఇతర పేదలందరికీ వర్తింప చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే కాపు రిజర్వేషన్ల అంశం పై పోరాడిన ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీలో గెలిచిన రాజకీయ నాయకుడు. కానీ తర్వాత తర్వాత ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీత మీద పోటీ చేసినప్పుడు మూడవ స్థానంలో ఉన్నాడు. అయితే 2014లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు నాయుడు గెలిచాక, తిరిగి కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టి , కాపు ఉద్యమ నాయకుడిగా మారాడు. అయితే కాపు రిజర్వేషన్లు అనే అంశంపై సుధీర్ఘంగా పోరాడిన చరిత్ర ఉండడంతో కాపులు కూడా ముద్రగడ వెంట నడిచారు.
అయితే చంద్రబాబు నాయుడు ఇంత కీలకమైన ప్రకటన చేసిన సమయంలో ముద్రగడ పద్మనాభం దానిని ఆహ్వానిస్తూ కానీ, లేదంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరణ ఇస్తూ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీని మీద భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తెర వెనుక ముద్రగడ పద్మనాభం ని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ చర్చల కారణంగానే, ముద్రగడ పద్మనాభం ప్రస్తుతానికి స్పందించడం లేదని, చర్చలు పూర్తయ్యాక అవి సఫలం కావడం లేదా విఫలం కావడం అన్న అంశాన్ని బట్టి చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించాలా లేదంటే విమర్శించాలా అన్నది ముద్రగడ నిర్ణయించుకుంటారని రూమర్లు వినిపిస్తున్నాయి.
ముద్రగడ ఎందుకు స్పందించడం లేదు అన్న సందేహాలకు తెర పడాలన్నా, ఈ రూమర్లకు తెర దించాలన్నా ముద్రగడ చంద్రబాబు నిర్ణయం పై స్పందించాల్సి ఉంటుంది.