నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదనే కసి… చంపేయడమే హీరోయిజం అన్నంత భ్రమ.. ఇంకా చెప్పాలంటే.. తాము ఏం చేసినా పెద్దగా శిక్షపడేదేమీ ఉండదన్న ఆలోచన ఏపీలో పెడతోవ పట్టిన యువకుల మైండ్లలో స్థిరపడిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రేమ పేరిట వరుసగా అమ్మాయిలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చంపేసిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వం హడావుడి చేస్తోంది. కానీ చావు బతుకుల్లోఉన్నవారు.. ప్రాణభయంతో పోలీస్ స్టేషన్లకు వెళ్లిన వారు గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా నేరాలు పెరిగిపోతున్నాయి.
ప్రేమ పేరుతో వరుసగా యువతులపై దారుణాలు…!
ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కకూడదన్న ఉన్మాదంతో విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు నర్సరావుపేటలో డిగ్రీ విద్యార్థినిని చంపేశాడు. ఈ ఘటనపై సీఎం స్పందించారు. రూ. పది లక్షల సాయం ప్రకటించారు. ఇదే మొదటిదా అంటే కాదు.. విజయవాడ, విశాఖ, అనంతపురం.. ఇలా వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం.. విశాఖలో యువతిని గొంతు కోసి చంపేశాడు. అనంతపురం జిల్లాలో ఓ బ్యాంక్ ఉద్యోగినిని చంపేసి కాల్చేశారు. దిశ తరహా ఘటన అది. రాజకీయంగా సంచలనం సృష్టించే సరికి.. భారీగా పరిహారం ఇచ్చి కుటుంబసభ్యుల నోరు మూయించారు. విజయవాడలో దివ్య తేజస్విని హత్య ఘటన ఇంకా కళ్ల ముందు కదలడాతూనే ఉంది. పోలీసులు.. ప్రభుత్వం ఇచ్చిన.. మళ్లీ జరగనివ్వబోమన్న్ భీకరమైన ప్రకటనలు పచ్చిగానే ఉన్నాయి. కానీ మరో ప్రేమోన్మాది తెగబడ్డాడు. తాను చేయబోతోంది తప్పు అనే భయం మనసులో లేకుండా ఉన్మాదానికి తెగబడ్డాడు.
నేరస్తులపై పోలీసుల నిర్లిప్త వైఖరే అసలు సమస్య.. !
అన్నిచోట్లా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ పోలీసులు చర్యలు తీసుకోకపవడంతో అవి హత్యల వరకూ వెళ్లాయి. ఇక హత్యలు దాకా వెళ్లకుండా దాడుల ఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నెలలో సగం రోజులు పరామర్శల యాత్రలు పెట్టుకోవాల్సి వస్తుంది. సత్తెనపల్లిలో ఇలా దాడికి గురైన యువతిని పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రి దిశ చట్టం కింద ముగ్గురికి ఉరేశామని ప్రకటించేసి కలకలం రేపారు. ఆమెను కనీస అవగాహన లేదని తేలిపోయిందన్న విమర్శలు ఎదుర్కొన్నాు. ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్మాదం వెర్రితలు వేస్తోంది. చిన్నారులపై దారుణాల దగ్గర్నుంచి యువతులను నిర్దాక్షిణ్యంగా చంపడం వరకూ.. నిరాటకంగా సాగిపోతున్నాయి. ఎవరికీ భయం అనేది లేకుండా పోయింది. తాము నేరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం నేరస్తుల్లో పోయింది. ఎలాగైనా బయటపడవచ్చన్న ఆలోచన వారికి వచ్చేసింది. ఫలితంగా… హత్యలు పెరిగిపోతున్నాయి.
పొరుగు రాష్ట్రంలో జరిగితే చట్టం తెచ్చారు.. ఏపీలో జరుగుతూంటే ఏం చేస్తున్నారు..?
పొరుగు రాష్ట్రంలో దిశ ఘటన జరిగిందని ఏపీలో దిశ చట్టం చేసిన ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఆ చట్టం రాజ్యంగ వ్యతిరేకంగా ఉండటంతో తిప్పి పంపారు. ఇప్పుడా చట్టం అమల్లో లేదు. అయినా ఇలాంటి నిందితుల్ని శిక్షించడానికి కఠినమైన చట్టాలున్నాయి. కానీ పోలీసులు మాత్రం నిందితుల్ని శిక్షించడంలో విఫలమవుతున్నారు. కొన్ని కొన్ని రాజకీయ ప్రాధాన్యం ఏర్పడే కేసుల్లో సీఎం పరిహారం ప్రకటిస్తున్నారు. దాంతో మొత్తం వ్యవహారం సైలెన్స్ అవుతోంది.