ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఆయారాం, గయారాంల హవా నడుస్తోంది. టీడీపీ, వైసీపీ.. గెలిచే పార్టీ ట్యాగ్ కోసం.. వరుసగా చేరికల్ని ప్రొత్సహిస్తున్నారు. ఫేడవుట్ అయిపోయిన నేతల్ని కూడా.. పార్టీలో చేర్చుకుని హడావుడి చేస్తున్నారు. కానీ జనసేన వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. టిక్కెట్ల కోసం.. స్క్రీనింగ్ మొదలయిందని .. పదే పదే చెబుతున్నా.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా నియోజకవర్గ స్థాయి నేత.. ఆ పార్టీలోకి వస్తామని… కానీ… వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా జరగడం లేదు. చివరికి పవన్ కల్యాణ్‌కు మద్దతు ఉంటుందని ప్రచారం జరుగుతున్న సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా.. ఆ పార్టీ వైపు చూడటం లేదు. గతంలో… పవన్ ను వ్యక్తిగతంగా దూషించి.. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పిన.. జగన్ దగ్గరకు క్యూ కడుతున్నారు కానీ… పవన్ వద్దకు రావడం లేదు.
రాజకీయాల్లో… రాజకీయ పార్టీలు తాము రేసులో ఉన్నామని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా.. ప్రముఖ నేతల్నీ చేర్చుకోవాలి. తమది గెలిచే పార్టీ అనే ఇమేజ్ రావాలంటే… చేరికలను విరివిగా నిర్వహించాల్సిఉంటుంది. ఆ ఇమేజ్ కోసం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. జగన్ జైల్లో ఉన్న సమయంలో.. టీడీపీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలు… అప్పట్లో జైల్లో ఉన్న జగన్ ను కలిసి ఆ పార్టీలో చేరిపోయారు. అప్పట్లో జగన్‌కు గెలిచే పార్టీ అన్న ఇమేజ్ ఉంది. కానీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. వైసీపీ జాబితాలో ఉన్న వారందరూ అయిపోయిన తర్వాత.. తాము ఇన్నింగ్స్ ప్రారంభిచాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో.. ప్రత్యర్థి పార్టీలపై మైండ్ గేమ్ కూడా ప్రయోగిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా… పరిస్థితి ఇలాగే ఉంది.
ఈ మైండ్ గేమ్‌లో.. జనసేన పూర్తిగా వెనుకబడిపోయింది. టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకుని.. పెద్ద ఎత్తున…వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. ప్రజల్లో అంతో.. ఇంతో.. పలుకుబడి ఉన్న నేతల్ని ఆకర్షించడానికి.. మైండ్ గేమ్ ప్రారంభించారు. కానీ ఒక్కరంటే.. ఒక్క నేత అయినా.. జనసేనలో చేరుతారన్న ప్రచారం జరగడం లేదు. తోట త్రిమూర్తులు లాంటి వాళ్లు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరిగినా.. ఇప్పుడది వైసీపీ వైపు మళ్లింది. పైగా… పవన్ సామాజికవర్గానికి చెందిన నేతలే.. జగన్ వద్దకు క్యూ కట్టడంతో… జనసేనకు మైండ్ గేమ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. పీఆర్పీ నుంచి గెలిచి రాజకీయ జీవితం ప్రారంభించిన అవంతి శ్రీనివాస్ లాంటి నేతలు కూడా జనసేన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుడా వైసీపీలో చేరిపోయారంటే.. ఇక జనసేనలో ఎవరు చేరుతారు..?