జనసేన పార్టీకి సంబంధించి.. రాష్ట్రంలో ఎక్కడా కదలిక లేదు కనీ.. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం ఓ మాదిరి నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా చేరుతున్న వారంతా.. ప్రముఖ నేతలైతే కాదు. అలా అని… టీడీపీలోనో.. వైసీపీలోనో.. టిక్కెట్ తెచ్చుకునేంత స్థాయిలో ఉన్న వారు కాదు. కానీ.. టిక్కెట్ కోసం పోటీ పడే స్థాయిలోనే ఉన్నారు. తమకు తాము ఉన్న పార్టీల్లో అవకాశం దక్కదని.. క్లారిటీ వచ్చిన తర్వాత.. వారికి గొప్ప చాయిస్గా జనసేన కనిపిస్తోంది. అందుకే.. వెళ్లి ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఇలా.. జనసేనలోకి చేరుతున్న వారంతా.. కాపు సామాజికవర్గం నేతలే. ఇతర వర్గానికి చెందిన ఒక్క నేత కూడా.. జనసేన వైపు చూడటం లేదు.
రాజమండ్రికి చెందిన కందుల దుర్గేష్ అనే నేత దగ్గర్నుంచి కాకినాడలో కొద్ది రోజుల క్రితం టీడీపీ తరపున కార్పొరేటర్ గా గెలిచి… మేయర్ పదవి ఇవ్వలేదని.. అప్పుడే తిరుగుబాటు చేసిన.. మాకినీడి శేషుకుమారి అనే నేత వరకూ..అందరూ.. ఒకే సామాజికవర్గం నేతలు. వీరందర్నీ వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో జనసేన పార్టీ… ఒక సామాజికవర్గం వారికే అన్న ముద్ర పడిపోతోంది. ఇప్పటికే.. జనసేనలో అత్యున్నత స్థాయిలో కానీ.. ఇప్పటి వరకూ నియామకాలు జరిపిన స్థాయిలో కానీ… 70 నుంచి 90 శాతం అదే సామాజికవర్గం నేతలు ఉన్నారు. ప్రజల్లోకి ఇదే వెళితే.. అది జనసేన పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడే పరిస్థితి కాదు.
కానీ పవన్ కల్యాణ్ ఈ పరిస్థితిని అంచనా వేస్తున్నారో లేదో ఎవరికీ అర్థం కావడంలేదు. ఎందుకంటే.. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ఇతరులు కొంత మందిని కలిసేందుకు కూడా పవన్ కల్యాణ్ ఆసక్తి చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరుతామని వస్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదట. అయితే.. ఇలా పవన్ నిరాదరణకు గురువుతున్న వారిలో.. కాపు సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. కానీ… ఇది పరిగణనలోకి రాదు. చేర్చుకుంటున్న వారు… చేరే వారు మాత్రమే పరిగణనలోకి వస్తారు. పవన్ కల్యాణ్ ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే.. ఒక సామాజికవర్గ పార్టీగా జనసేన మిగిలిపోయే ప్రమాదం ఉంది.