గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్-ఎంఐఎం మధ్య ఉన్న బంధం ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేము మిత్ర పక్షమే అని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. దీనిపై బీజేపీ నుండి ఎన్ని విమర్శలొచ్చినా, కేసీఆర్ ఎదురుదాడి చేశారే కానీ వెనక్కి తగ్గలేదు.
కానీ, అధికారం మారిన తర్వాత బీఆర్ఎస్- ఎంఐఎం మధ్య బంధం తెగిపోయినట్లే కనపడుతోంది. కానీ ఇది అంతటితో ఆగకుండా రెగ్యూలర్ గా ఎప్పుడు టైం దొరికినా ఓవైసీ కేసీఆర్ ను ప్రశ్నించటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారా…? మీ ఎంపీలు బీజేపీతో కలవబోతున్నారా…? ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అవుతున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పై ఓవైసీ విమర్శలు చేయటం ఇది తొలిసారి కాదు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాకు పరిమితం అయి, బీజేపీకి 8 సీట్లు రావటానికి కారణం కేసీఆరే అని… బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందని, కేసీఆర్ చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారని ఓవైసీ విమర్శించారు. రాంగ్ ఆడుతున్నారంటూ బహిరంగంగానే విమర్శించగా, ఇప్పుడు మరోసారి ఆరోపణలు గుప్పించటం చర్చనీయాంశం అవుతోంది.
పోనీ విమర్శల వరకే పరిమితం అయ్యారా అంటే అదీ లేదు. గత పది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణను అభివృద్ది చేశారు, అధికారం పోగానే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఓవైపు పొగుడుతూనే, మరోవైపు విమర్శిస్తున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందని… కాంగ్రెస్ ను ఎదుర్కొనే క్రమంలో ఈ రెండు పార్టీలు కలిసి నడిచే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో, సీనియర్ ఓవైసీ డైరెక్ట్ అటాక్ కు దిగటంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమయంలో కేసీఆర్ ను టార్గెట్ చేయటం వెనుక కాంగ్రెస్ ఉందా…? బీజేపీతో కేసీఆర్ కలవటం ఓవైసీకి నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.