రాజకీయం అంటే ప్రజలకు సమస్య వస్తే తాను ఉన్నానని భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రతిపక్ష నేతలకు అయితే అది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటే వారికి ముందుగా తమను పలకరించిన వారే గుర్తొస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏపీలో సీఎం సీటు కోసం తానున్నానని అప్పుడప్పుడూ ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్..ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పెద్దగా బయటకు రాలేదు. వందేళ్లలో రానంత వరద వచ్చి..గోదావరి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగు రోజుల పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తీసుకెళ్లగలిగినంత సాయం తీసుకుని వెళ్లి బాధితుల్నిపలకరించి.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో..పనులు ఎక్కడ ఆగిపోయాయో.. మళ్లీ తాము వస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ఆయన చేసేది రాజకీయమే. అందలో సందేహం లేదు. రాజకీయ నాయకుడు రాజకీయం చేయకుండా ఏం చేస్తారు ? రాజకీయం చేసి ప్రజల మెప్పు పొంది అధికారం చేపట్టాలి. సీఎం జగన్ విపత్తులు వచ్చినప్పుడు జనాన్ని పట్టించుకోరు.
వారం తర్వాత వచ్చి అందరూ బాగున్నారని.. సంతోషంగా ఉన్నారని చెప్పి వెళ్తారు. ఇలాంటి సీఎం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు మరింత అడ్వాంటేజ్ తీసుకుంటే… ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకే చంద్రబాబు పర్యటనలు జోరుగా చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇంత వరకూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనల గురించి ఆలోచించలేదు. జనసేన శ్రేణులు సాయం చేస్తున్నాయని చెబుతున్నారు . కానీ అధినేత వస్తే తప్ప ఆ ఎఫెక్ట్ కనిపించే అవకాశం లేదు.