జనసేన అధినేత పవన్ కల్యాణ్… చాలా త్వరగా ఎమోషనల్ అవుతారు. మాట్లాడుతూండగానే.. కొంచెం..కొంచెం స్వరంగా పెంచుకుంటూ… ఆవేశంతో చేతులు ఊపేస్తారు. ఒక్కోసారి గుండెలు బాదేసుకుంటూంటారు. అవన్నీ ఫ్యాన్స్‌కు అలవాటయిపోయాయి కానీ… ఇటీవలి కాంలో.. కొన్ని ఎమోషనల్ సీన్లను సభా వేదిక మీద నుంచి పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా.. ఫ్యాన్స్‌పై అభిమానాన్ని చూపించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే.. ఇవి .. సినిమాల్లో సీన్లను మించిన డైలాగులతో.. హెవీగా ఉంటున్నాయి. తీరా చూస్తా కామెడీ అయిపోతున్నాయి.
రంపచోడవరం బహిరంగసభలో ఒక అంశం మీద ప్రసంగిస్తూ.. హఠాత్తుగా.. బ్రాండ్ అంశం మీదకు వెళ్లారు. పవన్‌కు ఇది అలవాటే.. ఓ అంశంపై సగం మాట్లాడి..మధ్యలో ఏది గుర్తొస్తే అది మాట్లాడతారు. ఇలా బ్రాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు… తానెందుకు వాణిజ్య ప్రకటనలు చేయనో చెప్పుకొచ్చాడు. “ఈ బ్రాండ్ మీరిచ్చింది. మీరందరూ ప్రేమతో మలిచిన వ్యక్తిని నేను. అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఇది మీరిచ్చింది. అలాంటి బ్రాండ్‌ను ప్రజాసంక్షేమానికి ఉపయోగిస్తాను కానీ.. వాణిజ్య ప్రకటనలకు వినియోగించను” అంటూ డైలాగ్ కాస్త ఎమోషనల్‌గా చెప్పారు. నిజానికి పవన్ గతంలో పెప్సీ ప్రకటనలో కనిపించారు. కానీ ఆ సంస్థ పవన్‌ది యాడ్ ఫిలింకి యాడ్ అయ్యే ఫేస్ కాదనుకుందేమో కానీ.. ఒప్పందం పునరుద్ధరించుకోలేదు. కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లవ్వాలంటే చాలా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని పవన్ తానే వద్దనుకున్నానని ఫ్యాన్స్‌కు ఓ భారీ డైలాగ్‌తో చెప్పారు.
ఇదే మొదటి సారి కాదు.. కొద్ది రోజుల కిందట పాయకరావు పేటలో ప్రసంగిస్తూండగా.. ” ఓ అభిమాని.. అన్న జ్వరం తగ్గిందా” అని అడిగారు. దానికి పవన్ అత్తారింటి దారేది సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ చెప్పినట్లు చెప్పారు. “తగ్గలేదు . నా జ్వరానికి మీరే మందు. అదే తగ్గుతుంది. . మీ సమస్యలు పరిష్కరించడం.. వాటిని బయటకు తీసుకొస్తే నా జ్వరం పారిపోతుంది. అన్నీ భరించడానికే రాజకీయాల్లోకి వచ్చా. కష్టపడటానికి వచ్చాను. ఇంట్లో ముసుగుదన్ని పడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. జ్వరాలు.. అన్నీ ఉంటాయి. ప్రజలకు ఆనందం కల్గించే పనులకన్నా మించింది ఏముంటుంది? నా వల్ల ఓ సమస్య బయటకు వచ్చి ప్రభుత్వం దృష్టిలో పడితే చాలు.ఎన్ని జ్వరాలు వచ్చినా ఫర్వాలేదు” అనేశారు. పాపం ప్రశ్న అడిగిన అభిమానికి కూడా.. పవన్ ఎందుకింత డైలాగ్ చెప్పారో అర్థం అయి ఉండదు.
ఇక అంతకు ముందు పాతపట్నంలో ఎర్రటి ఎండలో పవన్ ప్రసంగిస్తుండగా ఓ చెమటలతో షర్టు తడిచిపోయింది. ఈయన బాధను చూసి ఓ అభిమాని.. తాను తెచ్చుకున్న గొడుకును పవన్ కు ఇచ్చారు. పవన్ దాన్ని తీసుకున్నారు. తర్వాత ఏమనుకున్నారో కానీ.. వెంటనే.. అప్పటి వరకు మాట్లాడుతున్న దాన్ని ఆపేసి..” మీరందరూ ఉండగా నాకు గొడుగు ఎందుకు.? అంటూ గొడుగును ముడిచి పక్కన పెట్టారు. మీకు చెమట పడితే నాకూ చెమట పట్టినట్టే. మీకు దెబ్బతగిలితే నాకు దెబ్బ తగిలినట్టే. మీరు కష్టపడితే నేను ఎలా సుఖంగా ఉంటాను. నేను సుఖంగా ఉండలేను” అని కవర్ చేసుకున్నారు. పవన్ తీరు చూస్తూంటే… ఇదంతా ప్రీప్లాన్డ్ గా ప్రాక్టీస్ చేసి వస్తారేమో అనిపించేలా.. ఈ ఘటనలు ఉంటున్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ విషయంలో ఇంత ఎమోషనల్ కావాల్సిన అవసరం ఉండదేమో..?
——- సుభాష్