తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్ ఎవర్నీ విమర్శించలేకపోతున్నారు. బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నందున ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీని తప్పనిసరిగా విమర్శించాలి. విమర్శించే ముందు అందర్నీ పొగుడుతున్నారు. కొత్తగూడెం,సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ.. ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. అవినతీ ఎక్కువగా ఉందని పేపర్ లీక్స్ వల్ల యువత నష్టపోయారని చెప్పారు. ధరణిలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించిందన్నారు.
ఇలా కొన్ని విమర్శలు చేసిన తర్వాత కేసీఆర్ మీద గౌరవం, కేటీఆర్ మీద నమ్మకం , రేవంత్ రెడ్డి పరిచయం ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ తీరు చూస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ మాదిరి విమర్శలు చేయడానికి కూడా మొహమాటపడుతున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. తన ప్రసంగంలో ఈ మాట కూడా చెబుతున్నారు. బీఆర్ఎస్ ను ఎందుకు విమర్శించడం లేదని అడుగుతున్నరాని.. తాను ఏపీలో తిరిగినట్లుగా తెలంగాణలో తిరగలేదన్నారు. నొప్పింపక .. తానొవ్వక అన్నట్లుగా ప్రచారం ముగించుకోవాలని పవన్ అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రసంగిస్తున్నారు. కానీ ఈ ప్రసంగాలతో.. జనసేన అభ్యర్థులకు ఓట్లు వేయాలనుకున్న వారు కూడా.. ఆలోచిస్తారని.. అగ్రెసివ్ గా.. ప్రభుత్వాన్ని తిడితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వస్తాయని తెలంగాణ జనసైనికులు మథనపడుతున్నారు. ప్రసంగాల్లో ఏపీ ప్రస్తావన ఎక్కువ తీసుకు వస్తున్నారు. అక్కడ తాను రౌడీలతో పోరాడుతున్నానని.. అంతగా పోరాడగలుగుతున్నానంటే తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తేనని చెబుతున్నారు.
అక్కడి పరిస్థితుల్ని వివరిస్తున్నారు. తెలంగాణలో పోటీ చేస్తూ.. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమి వస్తుందని కొంత మంది గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు.. పోటీ చేయకుండా ఉంటే మంచిది కదా అన్న వాదన కూడా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్ని రాజకీయాలుగా.. వ్యక్తిగత సంబంధాలను వ్యక్తిగత సంబంధాలుగా చూడలేకపోతున్నారు. రాజకీయంగా విమర్శిస్తే వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయని భావిస్తున్నట్లుగా ఉందని జనసైనికులు అనుకుంటున్నారు.