ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు దేశం మొత్తం మీద కూడా వేళ్ళ మీద లెక్కపెట్టే అంతమంది కూడా లేరు. అలాంటి నేపథ్యంలో ముందుగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగు నాయకుడు అయితే పవన్ కళ్యాణే. అయినప్పటికీ పవన్‌కి మాత్రం రావాల్సినంత పేరు రాలేదు. అయితే తాజాగా అమిత్ షా పైన విమర్శలతో విరుచుకుపడిపోయిన కెసీఆర్ మాత్రం హీరో అయిపోయాడు. కెసీఆర్‌ని చంద్రబాబు కూడా కాస్త ధైర్యం తెచ్చుకోవాలని అందరూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో అయితే సీమాంధ్రులు కూడా కెసీఆర్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రత్యేక హోదాతో సహా చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు మోడీ. అధికార స్వార్థం, కేసుల భయం ఉన్న నాయకులు మోడీకి సలాం కొట్టొచ్చేమో కానీ సీమాంధ్రులు మాత్రం బిజెపిని అక్కున చేర్చుకునే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు.
ఆ విషయం పక్కన పెడితే కెసీఆర్లనే మోడీని వ్యతిరేకించిన పవన్‌కి కెసీఆర్‌కి వచ్చిన స్థాయిలో హీరోయిజం ఎందుకు రాలేదు అన్న విషయంపై కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా జనసేన పార్టీకి అస్థిత్వం ఉండాలన్నా, పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదగాలన్నా కూడా చంద్రబాబుని విమర్శించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. మోడీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అలాగే తాను ఇచ్చిన హామీల విషయంలో కూడా మడత బేరం పెట్టిన చంద్రబాబు పాలనను సమర్థిస్తున్నవాళ్ళు ఎప్పటికీ పవన్ వైపు వచ్చే అవకాశం లేదు. ఇక పవన్ పార్టీ జెండా మోయాల్సింది చంద్రబాబు పాలన పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళే. ఆ నేపథ్యంలో మోడీతో పాటు చంద్రబాబుతో కూడా పోరాటానికి సిద్ధపడితే తప్ప పవన్‌కి పొలిటికల్ మైలేజ్ రాదు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ కూడా చేతులెత్తేసిన నేపథ్యంలో మోడీ, చంద్రబాబు, జగన్‌లకు వ్యతిరేకంగా పవన్ రంగంలోకి దిగితే మాత్రం రాజకీయంగా కూడా హీరో అవుతాడు. అసలు పవన్‌కి చంద్రబాబు కంటే కూడా బాబు అనుకూల మీడియా అంటే ఎక్కువ భయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బాబుకు దూరం జరిగిన మరుక్షణమే పవన్‌కి బాబు భజన మీడియా చిరంజీవికి చూపించిన సినిమా చూపించడం ఖాయం అని చెప్తున్నారు. మరి రాజకీయంగా ఎదగాలంటే బాబుకి వ్యతిరేకంగా నిలబడాల్సిన తప్పని పరిస్థితుల్లో పవన్ ధైర్యం చేస్తాడా? బలమైన బాబు భజన మీడియాను కూడా ఎదుర్కుని నిలబడగలడా? లేకపోతే 2019లో కూడా చంద్రబాబుకు సానుకూలంగానే ఉండి కొన్ని సీట్లను, లేకపోతే ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేస్తున్నాడా? పంచెలూడగొట్టండి అంటూ ఆవేశంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ యువతకు క్రేజీ హీరో అయ్యాడు. ఇప్పుడు పవన్ రాజకీయాలు వాళ్ళకు కూడా నచ్చని పరిస్థితి. ముందు ముందు పవన్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి మరి.