ఏపీ మంత్రి నారా లోకేష్ పై మరోసారి కొన్ని విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో ఆయన జెండా ఎగరేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్టాలకు స్పందించేవారే రాజకీయాల్లోకి రావాలన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం పెరగాలని ఆకాంక్షించారు. ఏపీకి ముఖ్యమంత్రి అవడానికి మంత్రి నారా లోకేష్ కి ఉన్న అనుభవం ఏంటని ప్రశ్నించారు? అంతేకాదు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో పోల్చుతూ… ఆయనకి ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉందనీ, ప్రజల్లోంచి గెలిచి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కి అలాంటి అనుభవం ఎక్కడుందని ప్రశ్నించారు. రెండ్రోజుల కిందట కూడా ఇలానే నారా లోకేష్ మీద పవన్ విమర్శలు గుప్పించారు. ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఉన్న అర్హతలు ఏంటంటూ ప్రశ్నించారు.
నిజానికి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారనే చర్చ తెలుగుదేశంలో కూడా లేదు..! 2019లోనే లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసేద్దామని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరాటపడుతున్న దాఖలాలు లేవు. విభజన తరవాత, ఇప్పుడిప్పుడే రాష్ట్రం సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇంకోపక్క, కేంద్రం నుంచి సహకారం సున్నా! ఇలాంటి, నేపథ్యంలో కేంద్రంతో ధీటుగా పోరాడే నాయకుడి నాయకత్వం రాష్ట్రానికి మరో ఐదేళ్లపాటు అవసరం అనే చర్చే ఏపీలో జరుగుతోంది. అంతేతప్ప… ముఖ్యమంత్రి అభ్యర్థులపై ఫోకస్ లేదు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే పదేపదే మాట్లాడుతున్నారు, అంతే!
మంత్రి కేటీఆర్ తో నారా లోకేష్ ని పోల్చి మాట్లాడటం విషయానికొస్తే… కేటీఆర్ కి ఉన్నట్టుగా లోకేష్ కి ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఎక్కడిదీ అని ప్రశ్నించారు? అందరికీ ఉద్యమాల్లో పాల్గొన్న నేపథ్యమే కావాలంటే ఎలా..? మరి, పవన్ కల్యాణ్ ఏ ఉద్యమ నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు? ఆయన నడిపిన, లేదా పాల్గొన్న ఉద్యమాలు ఏమున్నాయి..? ఇప్పుడు ఆయన కూడా సీఎం అభ్యర్థే కదా! పోనీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవుతారనే చర్చ తెలంగాణలో ఉంది, కనీసం ఏపీలో లోకేష్ విషయంలో అలాంటి చర్చ ఎక్కడుంది..? అనుభవం కావాలని పవన్ కల్యాణే చెబుతున్నారు కదా. ఇప్పటికిప్పుడు లోకేష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థే అనే చర్చ ఏదైనా ఉంటే… పవన్ విమర్శలు కొంత సమంజసంగా ఉండేవి! లోకేష్ కొన్నాళ్లు పార్టీ బాధ్యతలు చూశారు. ఇప్పుడు మంత్రిగా తన పరిధిలోని శాఖల్లో విజయాలు సాధించే దిశగా ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని ప్రాంతాల్లో పర్యటించడమే అనుభవం అని చెప్పుకుంటున్నప్పుడు… ఒక రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు పంచుకోవడం, మంత్రిగా వ్యవహరించడం కూడా అనుభవం కిందనే లెక్కగట్టాలి కదా!