జనసేన అధినేత పవన్ కల్యాణ్… పోరాటయాత్ర ఎజెండా మొత్తం చంద్రబాబు చుట్టూనే కేంద్రీకరించారు. తాను ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా.. దాన్ని చంద్రబాబుకు చుట్టేస్తున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి.. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ సభల్లో కనిపిస్తున్నారు. జగన్.. ప్రతి విషయానికి చంద్రబాబే కారణం అన్నట్లుగా చూపించడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఏటీఎంలలో డబ్బుల్లేకపోయినా చంద్రబాబే కారణమంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే చేస్తున్నారు. చివరికి ట్యాప్‌లో నీళ్లొచ్చినా.. చంద్రబాబు మినరల్ వాటర్ తాగుతున్నాడు.. మీకేమో మురికి నీళ్లిస్తున్నారు..? భరిద్దామా..? అంటూ రెచ్చగొట్టేస్తున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ నిన్నమొన్నటి వరకూ… చంద్రబాబు ప్రభుత్వంతో అంటకాగిన వాడే. ఆనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేసిన వాడే. కానీ అనూహ్యంగా ఆయన తన స్టాండ్‌ను మార్చుకున్నారు. అదీ కూడా అలా ఇలా కాదు.. ఆగర్భ శత్రువు చంద్రబాబన్నట్లుగా మాట్లాడుతున్నారు. తను వెళ్లే దారిలో … ఏదైనా స్టోర్ క్రషర్ కనిపిస్తే… అది అక్రమ మైనింగేనని.. దానికి చంద్రబాబు కారణం కాదా అంటూ… ప్రజలను ప్రశ్నిస్తున్నారు.
తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలంటే.. అందర్నీ విమర్శించుకుంటూ వెళ్లాలి. పాలక పార్టీని కొద్దిగా ఎక్కువ విమర్శించడంలో తప్పు లేదు. కానీ ఒక్క పార్టీనే.. ఒక్క నేతనే టార్గెట్ చేసుకుంటే.. మిగతా వాళ్లతో ఏదో అవగాహన ఉందన్న అనుమానం ప్రజలకు రాకుండా ఉంటుందా..? నిజానికి ఏపీలో బర్నింగ్ ఇష్యూ ప్రత్యేకహోదా. దీనిపై వైసీపీ నేరుగా… చంద్రబాబునే నిందిస్తుంది. ఇవ్వాల్సిన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనదు. ఒకప్పుడు.. ఓ రేంజ్లో విరుచుకుపడిన పవన్.. ఇప్పుడు వైసీపీ స్ట్రాటజీలోకి వెళ్లిపోయారు. మోదీని, కేంద్రాన్ని ఏమీ అనడం లేదు.
అదే సమయంలో.. జగన్, పవన్ ఇద్దరూ ఒకర్నొకరు విమర్శించుకోవడం లేదు. ఇద్దరితో పాటు.. బీజేపీ కలిసి..చంద్రబాబుపై ఎటాక్ చేస్తున్నాయి. దీంతో ఎక్కడో ఏదో సమీకరణం కలిసిందన్న అనుమానాలు … ప్రజల్లో వస్తున్నాయి. పవన్ శైలి చూస్తూంటే.. గత ఎన్నికల్లోలానే.. ఈ సారి కూడా ఎన్డీఏకు మద్దతిస్తారనే భావన ప్రజల్లో వస్తోంది. అయితే ఈ సారి ఎన్డీఏలో … టీడీపీకి బదులు వైసీపీ ఉంటుంది. జనసేన కూడా పోటీ చేస్తుంది. అంటే ఓ మహాకూటమిగా చంద్రబాబును ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా..అందరూ… ముఖ్యంగా నిన్నామొన్నటిదాకా అండగా నిలిచిన పవన్ చెలరేగిపోతున్నారన్నది రాజకీయ నిపుణుల అంచనా…
— సుభాష్