జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్ర విశాఖ జిల్లా పాయకరావుపేటకి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదా గురించి ప్రస్థావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ‘పవన్ కల్యాణ్ షడెన్ గా నాకు ఎదురు తిరిగాడు ఏమైందీ’ అనే ప్రశ్నకు… హోదాపై టీడీపీ ఒకే మాట మాట్లాడలేదన్నది తన సమాధానం అన్నారు. హోదాపై ఎప్పటికప్పుడు మాట మార్చుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. యువత గురించి మాట్లాడుతూ.. ఓట్లు వేయించుకోవడానికి యువత కావాలిగానీ, వారికి ఉపాధి కల్పించాలనీ, నైపుణ్యమైన విద్య అందించాలని ఏ ఒక్కరూ ఆలోచించిన పాపాన పోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే అన్నారు.
ప్రత్యేక హోదా గురించి తాను కాకినాడలో చెప్పాననీ, తిరుపతిలో చెప్పాననీ, అనంతపురంలో కూడా చెప్పానన్నారు. హోదా గురించి జనసేన మాట్లాడినప్పుడల్లా.. అవసరం లేదూ లేదని చెబుతూ వచ్చారన్నారు. హోదా కోసం పోరాటం చేద్దామనీ, ముందుకు దూసుకెళ్దామని చెబుతున్న ప్రతీసారీ అడ్డుతగిలారనీ, తనని ఇంట్లో కూర్చోబెట్టి నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందుకే, ఎన్నోసార్లు చెప్పి చూసిచూసీ బాగా విసిగిపోయానన్నారు. హోదా కోసం తెలుగుదేశం ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా, ఇప్పుడు ఇసుక తవ్వుకుని కబ్జాలు చేసుకునే పరిస్థితికి టీడీపీ వచ్చిందన్నారు పవన్.
పవన్ ఆరోపణలు పరిశీలిస్తే.. మొదటిది, తనను పోరాడకుండా ఇంట్లో కూర్చోబెట్టి నీరుగార్చారని! వాస్తవంగా మాట్లాడుకుంటే పవన్ ను అడ్డుకునే పని టీడీపీ సర్కారు ఎప్పుడూ చెయ్యలేదు కదా. అధికార పార్టీకి నిన్నమొన్నటి వరకూ అనుకూలంగా ఉన్న పవన్ ను ఎందుకు అడ్డుకుంటారు..? రెండోది… నాలుగేళ్లుగా విసిగిపోయాను కాబట్టే, ఇప్పుడు బయటకి వచ్చానంటున్నారు! ఇదే తరహా విసుగు అధికార పార్టీకి కేంద్రంపై వచ్చిందని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు..? హోదా ఇస్తామన్నది భాజపా, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామన్నది భాజపా, అది కూడా సాధ్యం కాదని కేంద్ర బడ్జెట్ లో మొండి చేయి చూపిందీ భాజపా..!
పేరేదైతేనేం, ప్రయోజనాలు ఇస్తామని కేంద్రమే చెబితే… రాష్ట్ర ప్రభుత్వం నమ్మాలి కదా. కేంద్రం ఏమిస్తామని చెబితే, రాష్ట్రంలో ప్రజలకు అదే చెప్పాలి. టీడీపీ చేసిందీ అదే కదా. నమ్మకద్రోహం చేసింది కేంద్రమైతే… నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిన ప్రయత్నానిది తప్పు అనేట్టు పవన్ పదేపదే విమర్శిస్తున్నారు. పవన్ పాయింటాఫ్ వ్యూలో తాను నాలుగేళ్లపాటు వేచి చూసిచూసీ ఇప్పుడు పోరాటం చేయడం కరెక్ట్ అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగేళ్లపాటు కేంద్రం వైపు ఆశగా చూసిచూసీ విసిగిపోయి ఇప్పుడు ఎదురుతిరగడమూ కరెక్టే కదా. అంటే, పవన్ ఆశించిన తరహాలోనే, అనుసరిస్తున్న బాటలోనే టీడీపీ కూడా పోరాటం చేస్తున్నట్టు కదా! అలాంటప్పుడు తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని పదేపదే అంటూ ప్రతీరోజూ ఈ ఊకదంపుడు విమర్శలెందుకు..?