ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కల్యాణ్ అరగంట పాటు సమావేశమయ్యారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీతో అయితే ఇదే మొదటి భేటీ. 2014 ఎన్నికలకు ముందు అహ్మదాబాద్ వెళ్లి కలిశారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో కలిశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క సారి కూడా కలవలేదు. పొత్తులో ఉన్న ఏ సమావేశానికీ పిలుపు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పిలిచి మాట్లాడారు. అయితే పవన్‌లో అంత ఉత్సాహం కనిపించలేదు. అరగంట భేటీ తర్వాత ఆయన డల్‌గానే కనిపించారు. మామూలుగా తాను చెప్పిన వాటికి ప్రధాని వైపు నుంచి సానుకూల స్పందన వస్తేనే కాస్త ఉత్సాహం ఉంటుంది. అలాంటిదేం లేదన్న అభిప్రాయం పవన్ కల్యాణ్‌ను చూసిన వారికి వస్తోంది.
మోదీతో పవన్ ఏం చర్చించారన్నదానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు కానీ.. రాజకీయ పరిస్థితులపై ఆయన నివేదిక ఇవ్వడమే కాకుండా .. వాటి గురించి చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యలు, రాష్ట్రం అథోగతి కావడం, కుంభకోణాలు, ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం వంటి వాటన్నింటిపైనా వివరించారు. అదే విధంగా మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపినట్లుగా సమాచారం. అయితే పవన్ ఏం చెబుతున్నా.. మోదీ తనకు తెలుసని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఇంకా చెప్పాలని అడిగినా.. అన్నీ తనకు తెలుసన్నట్లుగా మాట్లాడటంతో పవన్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదంటున్నారు.
అన్నీ తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న అనుమానం పవన్ కల్యాణ్‌లో రావడం సహజం. ఏపీ పరిస్థితులపై ఏమీ తెలియకపోతే సరే.. అన్నీ తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్న అభిప్రాయం పవన్‌లో రావడం వల్లనే డల్ అయ్యారని అంటున్నారు. అయితే జనసైనికులు మాత్రం పవన్‌లో నిరాశ ఎక్కడా లేదని.. ఆయన తీరిక లేని కార్యక్రమాల్లో గడుపుతూ.. హఠాత్తుగా ప్రధాని మోదీ ఇచ్చిన అపాయింట్మెంట్ మేరకు వచ్చారని.. అది ప్రయాణబడలికే కానీ.. మోదీతో సమావేశం ఎఫెక్ట్ కాదంటున్నారు.