నిరాహార దీక్ష ద్వారా ఉద్రిక్తత రేకెత్తించి అసాంఘిక శక్తులపై బేషరతుగా కేసులు రద్దు చేయాలంటున్న ముద్రగడ డిమాండు జనంలోకి లోతుగా వెళ్ళిపోయింది. ఇది ఆయన మీద సానుభూతిని పలచబరుస్తోంది కూడా! అయితే రైళ్ళు తగలబెట్టిన సంఘటనలో దాఖలైన మొత్తం 69 ఎఫ్ ఐ ఆర్ లనూ చూపించవలసిందేనన్న ముద్రగడ డిమాండ్ కి మీడియా అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
దర్యాప్తు వివరాలను బయటపెడితే నేరస్ధులు తప్పించుకునే అవకాశం వుంది కాబట్టి ఆవివరాలు రహస్యంగానే వుంచుతారు. ఎఫ్ ఐ ఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) రహస్య డాక్యుమెంటు కాదు. అయితే ఎఫ్ఐఆర్ లు చూపించడం సాధ్యం కాదని సిఐడి అధికారులు చెప్పారు. రాజకీయ వివక్షతతోనో, కక్షసాధింపుగానో కేసులు పెడుతున్నారని ముద్రగడ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లు చూపించడానికి పోలీసులు నిరాకరిస్తూండటాన్ని బట్టి ఆ ఆరోపణలకు ఎంతో కొంత ఆధారం వున్నట్టు కనిపిస్తోంది.
రైలుతగలబెట్టిన కేసుల్లో మాత్రమే కాక రాజకీయ డిమాండ్లు వున్న అన్ని ఉద్యమాల్లోనూ ఉద్యమకారులు అంతా మరచిపోయాకే కేసులు విరుచుకు పడతాయి. అధికారపార్టీ కి నచ్చని వారిమీద కేసులు బనాయించడం పార్టీలు, రాష్ట్రాల తేడా లేకుండా అన్నిచోట్లా జరుగుతున్నదే! ఎఫ్ ఐ ఆర్ లను పారదర్శకంగా వుంచితే ”అంతా ముగిశాక బాగా ఆలోచించి కేసులు బనాయించే” అవకాశమే వుండదు!
ఎఫ్ ఐ ఆర్ లు చూపించాలన్న ముద్రగడ డిమాండు వెనుక కేసుల బనాయింపు మూలాల్ని సాంకేతికంగా నిలదీయడం వుంది.
ముద్రగడ శాంతి భద్రతల విషయంగా రాష్ట్రప్రభుత్వాన్ని, రాజకీయంగా తెలుగుదేశాన్ని, ఉద్రిక్తతలకు కారకుడై ప్రజల్ని ఇబ్బందిపెడుతున్నారు. కిర్లంపూడిలో ఆయన్ని అరెస్టుచేసి, రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆస్పత్రిలోపలా బయటా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి రోగులకు, వారిసహాయకులకు, తీవ్రమైన అసౌకర్యాన్ని, కష్టాల్ని సృష్టిస్తున్నారు.