ఖమ్మం బీఆర్ఎస్ సభలో జేడీఎస్ నేత కుమారస్వామి కనిపించలేదు. ఆయన కాకపోయినా ఆయన పార్టీ ప్రతినిధులైనా వస్తారని అనుకుంటే అసలు ఎవరూ రాలేదు. దాంతో అసలు బీఆర్ఎస్ పార్టీ పరుగు ప్రారంభించకుండా మిత్రులు దూరమైపోయినట్లుగా అనిపిస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ అని అనుకున్న తర్వాత ప్రతి సందర్భంలోనూ కుమారస్వామి వచ్చారు. తీర్మానం చేసినప్పుడు.. అధికారికంగా ఈసీ నుంచి వచ్చి సంతకం చేసినప్పుడు..ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ వచ్చారు. కానీ అసలైన ఆవిర్భావ సభ విషయంలో మాత్రం దూరంగా ఉన్నారు.
కుమారస్వామికి ఇతర కార్యక్రమాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కానీ.. ఆయన తరపున పార్టీ ప్రతినిధి బృందాన్ని అయినా పంపి ఉండేవారు కదా అనే డౌట్ సహజంగానే ఇతరులకు వస్తుంది. అదే సమయంలో.. ప్రకాష్ రాజ్ కూడా ఈ సభలో కనిపించలేదు. గతంలో బీఆర్ఎస్ వ్యవహారాల్లో ఆయన అప్పుడప్పుడూ కనిపించారు. కర్ణాటక బీఆర్ఎస్ బాధ్యతలు ఆయనకు ఇస్తారన్న ప్రచారం జరిగింది.కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆవిర్భావ సభలో ఆయన పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణాలేమిటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.
కేసీఆర్ ఇటీవల కర్ణాటకలో జేడీఎస్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ కూడా అక్కడ ప్రచారం చేస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో రెండు పార్టీల నేతల మధ్య పొసగలేదన్న రూమర్ ప్రచారంలో ఉంది. దీనికి కారణం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి… పొత్తు పెట్టుకున్నా బీఆర్ఎస్ పోటీ చేయదని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి ఈ అంశంలో రెండు పార్టీల మధ్య తేడాలొచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో కానీ.. ఇంత కాలం దూరంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ బాగా దగ్గరయింది.కానీ ఇతర పార్టీలు బీఆర్ఎస్కు దూరం జరుగుతున్నాయి.