దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని.. రాజకీయ పార్టీలపై అధికార పార్టీ విరుచుకుపడుతుంది. బుద్దుందా.. సిగ్గుందా అంటూ.. చెలరేగిపోతున్నారు. వారు చేస్తోంది అదే అయినా.. వారి ఎదురుదాడి చాలా మందిని విస్మయపరుస్తోంది. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా… ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అడగడం.. తప్పైపోయింది. మామూలుగా అయితే..ఇలాంటి ఘటనలు జరిగితే.. కుట్రదారుల్ని కనిపెట్టి… ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ జరిగిన ఘటనల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. పిచ్చివాళ్ల పని అంటూ తేలిగ్గా తీసేయడం ప్రారంభించారు. ఇదే ప్రజల్లో అసహనానికి కారణం అవుతోంది.
అంతర్వేదిలోనే ప్రజల అసహనం బయట పడింది. పరిస్థితులు అదుపుతప్పే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఇప్పుడు… రామతీర్థం అంశం.. దావాలనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. నిందితుల్ని పట్టుకుని అసలేం జరిగిందో చెప్పాల్సిన ప్రభుత్వం మంత్రులు.. ఎవరు ప్రశ్నిస్తారో… వారే రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. చివరికి ఆ ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పదవిని తీసేసి.. తామేదో.. గొప్ప ఘనకార్యం చేశామని అనుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత ప్రజాగ్రహం కళ్ల ముందు కనిపిస్తూండటంతో మొక్కుబడిగా వెళ్లి… రాజకీయ విమర్శలు.. ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
నిజానికి ఆలయాలపై దాడులు రాజకీయ అంశం కాదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రభుత్వమే పట్టించుకుని ఉంటే.. నిందితుల్ని పట్టుకుని ఉంటే రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాల్సిన అవసరం ఏముంది..?. అంతే కాదు..స్వయంగా ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. దేవుళ్ల పై జరుగుతున్న దాడుల్ని ఆజ్యం పోసి మరీ పెంచుతోంది. రెచ్చగొట్టే వివాదాస్పద ప్రకటనలు చేసి… ప్రజల్లో మరింత ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రశ్నించిన వారిపైనే నిందలు వేయడం పాలసీగా పెట్టుకుంది. చంద్రబాబు ప్రశ్నిస్తే చంద్రబాబు చేయించాడంటారు. లోకేష్ ప్రశ్నిస్తే లోకేష్ చేయించాడంటారు. అశోక్ గజపతిరాజు ప్రశ్నిస్తే ఆయనే చేయించాడంటారు. బీజేపీ ప్రశ్నిస్తే బీజేపీ నేతలే చేయించారంటారు. ఇలా ఎదురుదాడి చేసి.. ఆ ఆలయాల్లో జరుగుతున్న వ్యవహారాల్ని రాజకీయం చేస్తూ పోతున్నారు కానీ.. అసలు వాస్తవాలేమిటో బయట పెట్టడం లేదు. పైగా.. విపక్షాల్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించడం బరితెగింపునకు మరో సాక్ష్యం.