దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ నుండి బహుబలి పార్ట్ వన్ వరకు అతని దర్శకత్వంలో సినిమా అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అన్నట్టే. అయితే తన సినిమాలను ప్రేక్షకుల్లో ఎలా తీసుకెళ్ళాలో బాగా తెలిసిన జక్కన్న తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే వారికి ఆ మెళుకువలు నేర్పలేదనుకుంటా అందుకే తన అసిస్టెంట్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్ని అపజయ పాలవుతున్నాయి.
రాజమౌళి శిష్య్రరికం చేసి సినిమాల దర్శకత్వం వహించిన వారిలో ముందుగా మిత్రుడు సినిమా తీసిన మహదేవ్ వస్తాడు. రాజమౌళి మేనియాను కన్ టిన్యూ చేస్తాడు అనుకున్న ఆ దర్శకుడు సినిమాను హిట్ చేసుకోలేకపోయాడు. ఇక రాజమౌళి దగ్గర సహ దర్శకుడిగా పనిచేసిన త్రికోటి కూడా దిక్కులు చూడకు రామయ్య అంటూ వచ్చి అడ్రెస్ లేకుండా పోయాడు. ఇప్పుడు రాజమౌళి మరో శిష్యుడు జగదీశ్ తలశిల కూడా లచ్చిందేవికి ఓ లెక్కుంది అంటూ వచ్చాడు.
నిన్న విడుదలయిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదలకు వచ్చి మరి ఆల్ ది బెస్ట్ చెప్పిన రాజమౌళి పరువు ఈ శిష్యుడైనా కాపాడతాడు అనుకుంటే ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతుంది. ఓటమే ఎరుగని రాజమౌళి ఈ విభాగంలో అంటే తన దగ్గర అసిస్టెంట్ గా చేసిన వారు సక్సెస్ కొట్టలేకపోతున్నారనే విషయం మీద అపవాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ విషయం మీద జక్కన్న ఏదైనా చర్యలు తీసుకుంటే బెటర్ లేదంటే మరో అసిస్టెంట్ సినిమా కూడా పోతే రాజమౌళి హిట్ కొడతాడు కాని అతని శిష్యులు మాత్రం ఫ్లాప్ సినిమాలనే తీస్తారు అనే సెంటిమెంట్ బలపడుతుంది.