రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటించారు. తమిళనాడులో అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు. అప్పుడప్పుడూ రాజకీయాలతో ముడిపడిన అంశాలపై స్పందిస్తుంటారు. ఇటీవల విజయ్ ‘సర్కార్’ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగితే స్పందించారు. అయితే.. హైదరాబాద్లో నిర్వహించిన ‘2.ఓ’ విలేకరుల సమావేశంలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. మౌనమే రజనీ సమాధానం అయ్యింది. చిన్న చిరునవ్వుతో సరిపెట్టారు. తెలుగు మీడియా నుంచి రాజకీయ ప్రశ్నలు ఎక్కడ ఎదురవుతాయోననే చిన్న టెన్షన్ రజనీలో వుందో? లేదా రాజకీయాల గురించి మాట్లాడితే… సినిమాను పక్కన పెట్టేసి, రాజకీయాలను హైలైట్ చేస్తారని భావించారో? ఏ టాపిక్ రాజకీయాలవైపు మళ్లకుండా చూసుకున్నారు. తెలుగు మీడియా ప్రశ్నలు అడగటానికి ముందే “సమయం తక్కువ వున్న కారణంగా సినిమా గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి” అని నిర్మాత దిల్రాజు మీడియాకు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇటువంటి సమయంలో తమిళనాట బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న రజనీకాంత్ వ్యూహాత్మకంగా అయినా మౌనం పాటించడం అంత మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.