నాటునాటు పాటకు ఆస్కార్ వచ్చింది. ఈ పాటని లైవ్ లో.. పాడి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కూడా వేదికపై డాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ.. అది జరగలేదు. దీనిపై భిన్నమైన సమాధానాలు వచ్చాయి. `స్టేజీపై డాన్స్ చేసే అవకాశం వచ్చింది.కానీ.. ప్రాక్టీస్‌కి తగిన సమయం దొరకలేదు. అందుకే డాన్స్ చేయడం లేదు` అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పాడు. చరణ్ మాత్రం తమకు ఆహ్వానం అందలేదన్నారు. దాంతో.. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆస్కార్ కమిటీ… లైవ్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఇచ్చానా.. ఎన్టీఆర్, చరణ్‌లు ఒప్పుకోలేదా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు లైవ్ పెర్ఫార్మ్ ఇవ్వడానికి ఎన్టీఆర్, చరణ్‌లను ఆహ్వానించామని, అయితే… దానికి వారిద్దరూ ఒప్పుకోలేదని ఆస్కార్ కమిటీలోని కీలక సభ్యుడు వెల్లడించారు.
ఫిబ్రవరి చివరి వారంలో.. ఎన్టీఆర్, చరణ్‌లకు ఆస్కార్ కమిటీ నుంచి పిలుపు అందిందని, పాటకు లైవ్‌లో డాన్స్ చేయగలరో, లేదో వాకబు చేసిందని తెలుస్తోంది. మామూలుగా అయితే ఓ పాటకు 15 రోజుల ప్రిపరేషన్ చాలు. కానీ.. నాటు నాటు మామూలు పాటు కాదు. ఆ పాటంతా ఎన్టీఆర్, చరణ్‌లు ఓ సింక్‌లో డాన్స్ చేస్తారు. చాలా క్లిష్టతరమైన స్టెప్పులున్నాయి. సెట్లోనే.. ఒక్కో స్టెప్పుకీ టేకుల మీద టేకులు తీసుకొన్నారు. ఈ పాట తెరకెక్కించడానికి దాదాపుగా 17 రోజుల సమయం పట్టింది. ఇలాంటి పాటని లైవ్ లో చేయడం చాలా కష్టం. ఏమాత్రం సింక్ తప్పినా… అభాసుపాలవుతారు. అందుకే ఎన్టీఆర్, చరణ్‌లు ఆ రిస్క్ తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఓ పాటకు లైవ్‌లో డాన్స్ చేసిన అనుభవం ఎన్టీఆర్. చరణ్‌లకు ఇప్పటి వరకూ లేదు. పైగా ఆస్కార్ అనేది మామూలు వేదిక కాదు. అకాడమీ సైతం ఈ రిహార్సల్స్ ని పరీశీలిస్తుంది. వాటి ప్రోటో కాల్స్ వేరుగా ఉంటాయి. అందుకే హీరోలిద్దరూ.. `నో` చెప్పి ఉంటారు. నిజంగా.. చేసి ఉంటే, ఎన్టీఆర్, చరణ్‌ల పేర్లు చరిత్రలో నిలిచిపోదును.