పట్టుజారిపోతున్న కంగారులో ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితికి వైసీపీ పెద్దలు వెళ్లిపోతున్నారు. గత ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సాయం చేసిన ఆర్జీవీతో ఈ సారి ఏకంగా మూడు సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందు కోసం చర్చించేందుకు జగన్ ఆర్జీవీతో విందు భేటీ నిర్వహించారు. ప్రత్యేకంగా తాడేపల్లికి ఆర్జీవీని పిలిచిన జగన్.. తనకు ఎలాంటి సినిమాలు కావాలో చెప్పినట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రంగంలో ఉన్న రోజా, దర్శకుడు సెల్వమణిలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఆ పొత్తును టార్గెట్ చేస్తూ ఉండేలా ఓ సినిమాను రూపొందించనున్నట్లుగా చెబుతున్నారు. కమ్మ – కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టే మిషన్‌ను ఇప్పటికే వైసీపీ ప్రారంభింది. సోషల్ మీడియాలో వైసీపీ ఫేక్ అకౌంట్లతో దాడి చేస్తున్నారు. తాజాగా సినిమాలు తీయనున్నారు. గతంలో ఆర్జీవీ వంగవీటి అనే సినిమాను తీశారు. కానీ పెద్దగా ఆడలేదు. మరోసారి అలాంటి ప్రయత్నం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంలోనూ ప్రజలకు మరింతగా చెప్పాలని ..అది ఆర్జీవీ అయితేనే బెటర్‌గా ఉంటుందని వైఎస్ఆర్సీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పవన్ మూడు పెళ్లిళ్ల అంశంపై వైఎస్ఆర్సీపీ నేతలు విస్తృతంగా విమర్శలు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా సినిమా ఉంటుందని అంటున్నారు.
మూడో సినిమా టీడీపీని టార్గెట్ చేస్తూ తీయాలా.. జగన్ ను ఎలివేట్ చేస్తూ తీయాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. పాజిటివ్ గా తీస్తే స్పందన ఉండదని.. ఇతరులపై బురద చల్లే సినిమాలు అయితే బెటరన్న అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. జగన్ బయోపిక్‌గా యాత్ర 2 తీస్తానని గతంలో దర్శకుడు మహి వీ రాఘవ్ ప్రకటించారు. అయితే ఆ సినిమా ఎక్కడి వరకు వచ్చిందో సమాచారం లేదు.
అయితే అధికారంలో ఉండి.. ఇలా కులాలను రెచ్చగొట్టేలా సినిమాలు తీయడం.. తన పాలనను కాకుండా ఇతర అంశాలపై ఆధారపడటం అంటే ప్రజల్లో వేరే అర్థం వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. పైగా ఆర్జీవీ సినిమాలపై ఇప్పుడు పూర్తిగా ఆసక్తి తగ్గిపోయింది. ఎలాంటి సినిమా తీసినా ఎవరూ చూడటం లేదు. కనీసం రిలీజ్ కావడం లేదు. ఓటీటీలోనూ ఆయన సినిమాలు తీసుకోవడానికి సంస్థలు ముందుకు రావడం లేదు. ఆయనతో పెట్టుకుంటే డబ్బు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదన్న వాదన ను వైసీపీలో మరో వర్గం వినిపిస్తోంది.