ఈరోజుల్లో ఏ సినిమాకైనా సరే.. పబ్లిసిటీ చాలా అవసరం. పాన్ ఇండియా ట్యాగ్ పెట్టుకొంటే మరింత అత్యవసరం. దేశమంతా తిరిగి `మా సినిమా వస్తోందంటూ` టంకు వేయాల్సిందే. అందుకోసం చిత్రబృందం కష్టపడాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న నానినే చూడండి. ఆల్ ఇండియా టూర్ వేసేశాడు.. దసరా కోసం. అంత చేసినా, నార్త్ లో దసరాని ఎవరూ చూళ్లేదు. ఇప్పుడు శాకుంతలం వస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ పై గుణశేఖర్ భారీ నమ్మకాలు పెట్టుకొన్న సినిమా ఇది. ఎందుకంటే ఇటీవల ముంబైలో.. సమంతకు ఫ్యాన్ బేస్ పెరిగింది. ఫ్యామిలీమెన్ 2తో.. సమంత అక్కడివాళ్లనీ ఆకట్టుకోగలిగింది. శాకుంతలం పాన్ ఇండియా సినిమాకి సరిపడ సబ్జెక్ట్. విజువల్ హంగులు బోలెడన్ని ఉన్నాయి. పైగా త్రీడీ సినిమా. అందుకే మిగిలిన భాషల్లోంచి కూడా వసూళ్లు రాబట్టొచ్చన్నది గుణశేఖర్ ప్లాన్. అందుకే ఈ సినిమాపై ఇంత ఖర్చు పెట్టారు.
ఈనెల 14న శాకుంతలం విడుదల అవుతోంది. అయితే పబ్లిసిటీ మాత్రం.. పాన్ ఇండియా స్థాయిలో లేదు. ముంబై, కొచ్చిలలో ప్రెస్ మీట్లు పెట్టినా.. ఈ సినిమాకి బజ్ రాలేదు. అలాగని తెలుగులో ప్రమోషన్లు కుమ్మేశారా? అంటే అదీ లేదు. ఈ సినిమా కోసం గుణ శేఖర్ నమ్ముకొన్నది సమంతని మాత్రమే. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా.. ప్రమోషన్లలో పాల్గొంటోంది. కానీ ఇది ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే… రూ.70 కోట్లతో తీసిన సినిమా ఇది. భారీ ఓపెనింగ్స్ రాకపోతే, గట్టెక్కడం కష్టం. మౌత్ టాక్ ని నమ్ముకొన్నా.. అది స్పైడ్ అయి, జనాలు థియేటర్లకు వచ్చేసరికి… ఆలస్యమైపోతుంది. దిల్ రాజుకి మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా తెలుసు. ప్రమోషన్ల విషయంలో దిల్ రాజు రాజీ పడడు. ఈ సినిమాలో వాటా దక్కించుకొన్న దిల్ రాజు కూడా ప్రమోషన్లను లైట్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.