భారతదేశంలో ఉన్న అన్ని మతాల, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలూ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లను అమితంగా అభిమానించారు. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమించారు. అభిమానులకు మతం గురించి పట్టింపులేకపోయింది కానీ ఆ హీరోలకు మాత్రం దేశం కంటే మతమే ప్రథమ ప్రాధాన్యం అయింది. అలాంటి అర్థం వచ్చేలా వాళ్ళే మాట్లాడారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కూడా మనదేశంలో హిందూ ముస్లిం వివాదాలు కొత్తేం కాదు. అంతకంటే ఎక్కువగా రెండు మతాలవారూ కలిసిపోయారన్నది కూడా వాస్తవం. కానీ కొంతమంది ఛాందసులు మాత్రం మూర్ఖత్వంతో ఆవేశపూరితంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలకు నష్టం జరిగినప్పుడే, వాళ్ళు ఇబ్బందులు పడినప్పుడే ఎక్కువ స్పందిస్తుంది భారతదేశం. మన మీడియా, మేధావులు, విమర్శకులందరూ కూడా మైనారిటీలకు సపోర్ట్‌గా మాట్లాడటానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయంపైన అతివాద హిందువులకు బోలెడన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అయితే సగటు భారతీయులలో ఎక్కువ మంది ఎప్పుడో కలిసిపోయిన మాట వాస్తవం.
అరవై ఏళ్ళుగా కొన్ని కుటుంబాల వాళ్ళే మనదేశంలో రాజకీయం చేస్తున్నారు. అధికారం పంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు మాత్రం మతపరమైన వివాదాలు సమసిపోవడం ఇష్టం ఉండదు. మేం లేకపోతే పరాయి మతస్తులు మీ పైన దాడి చేస్తారు అన్న భయాన్ని ఇరువర్గాల ప్రజల ఆలోచనల్లోనూ సజీవంగా ఉంచడం వాళ్ళకు అత్యవసరం. అదే లేకపోతే అసలు ఈ పాలకులు మన కోసం ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న ప్రజల మెదళ్ళలో ఉదయిస్తుంది. ప్రజలు ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచించడం ప్రారంభించారంటే వంశపారం పర్యంగా పదవులు అనుభవిస్తున్న నాయకుల పని అయిపోయినట్టే. తెలుగు రాష్ట్రంలోనే ఉన్న ఓ ప్రధాన లోక్ సభ నియోజక వర్గం నుంచి దశాబ్ధాలుగా ఒక కుటుంబానికి చెందిన సభ్యులే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా మా బస్తీలు అభివృద్ధి చెందడం లేదని వాపోతూ ఉంటారు. మరి ఏళ్ళ తరబడి ఎంపిలుగా ఉన్న ఈ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నట్టు? ఆ ఆలోచన ఓటర్లకు రాకూడదంటే వాళ్ళలో లేని భయాలు కలిగించాలి. అలాంటప్పుడే రాజకీయనాయకులకు మతం గుర్తుకొస్తుంది. అంతకు మించిన మత్తును, ఆయుధాన్ని ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేదు మరి.
టెర్రరిస్టుల దాడులు జరిగినప్పుడు, వందల మంది చనిపోయిన సందర్భాలలో కూడా స్పందించని బాలీవుడ్ ఖాన్ ద్వయానికి మోడీ ప్రధానమంత్రి అయ్యాక మాత్రం సో కాల్డ్ రాజకీయ నాయకుల్లాగే దేశంలో అసహనం పెరిగిపోతోందనపించింది. దేశంలో బ్రతకలేని పరిస్థితులు వచ్చాయని అనిపించింది. అవమానాలు పడుతూ భయంతో బ్రతకాలా అనిపించింది. వీళ్ళ ఎమోషన్స్ కరెక్టే అనుకుందాం. మరి ఎన్ని సార్లు అవమానించినా, ముస్లిం మతస్థుల విషయంలో ట్రంప్ లాంటి నేతలు అరాచకంగా మాట్లాడుతున్నా ఈ హీరోస్ ఎందుకు స్పందించరు. అలాంటి గడ్డపైన అస్సలు అడుగు పెట్టనే కూడదు కదా? ప్రతి సారి ఆ దేశం వెళ్ళడం ఎందుకు? నన్ను అవమానించారు అని బాధపడడం ఎందుకు? మన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్ ఎలాగూ ప్రాపర్‌గా ఉండవు. డైరెక్టర్‌కి అవసరమైనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. రియల్ లైఫ్‌లో కూడా ఈ హీరోలు ఇంతేనా? భారతదేశం విషయంలో వీళ్ళు బాధ, ఆవేధన, ఆవేశం నిజమే అయితే అమెరికా విషయంలో కూడా అదే రియాక్షన్ ఉండాలి కదా? అలా జరగడం లేదంటే రియల్ లైఫ్‌లో కూడా వీళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో డిసైడ్ చేసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా?
బిజెపి పార్టీ, విహెచ్పి, ఆరెస్సెస్లాంటి సంస్థలలో ఉన్న కొంతమంది తప్పుగా మాట్లాడిన మాట వాస్తవం. ధైర్యం ఉంటే వాళ్ళను తప్పు పట్టాలి. వాళ్ళ మాటలను తప్పు పట్టాలి. అలాగే ప్రధానమంత్రి మోడీ కూడా ఓ వర్గం ప్రజలలో భయాందోళనలు కలిగేలా మాట్లాడేవాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు అనిపిస్తే మోడీని కూడా విమర్శించొచ్చు. అంతే కానీ దేశం గురించి తప్పుగా మాట్లాడటం మాత్రం ముమ్మాటికి తప్పే. కరెక్ట్‌గా చెప్పాలంటే క్షమించరాని నేరం.