‘మా’ అధ్యక్షుడిగా శివాజీ రాజాకి క్లీన్ ఇమేజ్ ఉంది. తన టీమ్ రెండేళ్లలో చాలా కష్టపడింది. ఎన్నో అభివృద్ది కార్యక్రమాల్ని చేసింది, పించన్లు, కల్యాణ లక్ష్మి పథకాలు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు.. ఇలా చాలా రకాలుగా ‘మా’ సభ్యులకు లబ్ది చేకూరింది. శివాజీరాజా రెండోసారి కూడా `మా` పీఠం ఎక్కడం ఖాయం అని జనాలు లెక్కలేసుకున్నారు. కానీ అనూహ్యంగా నరేష్ విజయం సాధించాడు. శివాజీ రాజా అంత చేసినా.. ఎందుకు ఓడాడు?? తన క్లీన్ ఇమేజ్ కూడా తనని ఎందుకు కాపాడలేకపోయింది? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
శివాజీ రాజా ప్యానల్‌కి చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున లాంటి పెద్దల సహకారం లభించడంతో – తప్పకుండా ఈసారి ఎన్నికలలో శివాజీ రాజా గెలవడం లాంఛనమే అనుకున్నారు. అయితే… నాగబాబు సడన్‌గా రంగంలోకి దిగి మెగా కాంపౌండ్‌ని నరేష్ వైపు టర్న్ చేయగలిగాడు. మెగా కాంపౌండ్ మాట వినేవాళ్లు, వాళ్లు ఎటు నడిస్తే అటు నడిచేవాళ్లు ‘మా’లో కొంతమంది ఉన్నారు. వాళ్లంతా ఈసారి నరేష్ వైపు నిలబడ్డాడు.
మా పూర్తి సహకారం శివాజీ రాజాకే అని చెప్పిన మోహన్ బాబు, బ్రహ్మానందం లాంటివాళ్లు.. ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి కూడా రాలేదు.
`మా`ని ఓ కుదుపు కుదిపేసిన ఘనట శ్రీరెడ్డి వ్యవహారంతో జరిగింది. శ్రీరెడ్డి విషయంలో శివాజీ రాజా టీమ్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అది కాస్త `మా` ప్రతిష్టని భంగం కలిగించింది.
నరేష్ కి జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ పదవిలో నరేష్ చురుగ్గా పాల్గొన్నాడు. విజయ నిర్మల పేరుతో కొన్ని పథకాలు ప్రవేశ పెట్టి.. పేద కళాకారుల పెళ్లికి సహాయం చేశాడు. అది నరేష్‌కి బాగా కలిసొచ్చింది. పైగా నరేష్ స్వయంగా ఓ సర్వే నిర్వహించి అసలు `మా`లో పేదవాళ్లు ఎవరు? ఎవరికి ఎలాంటి సహాయం కావాలి? ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టాలి? అనే విషయాల్ని సమగ్రంగా రాబట్టాడు. ఆ సర్వే నరేష్ కి ప్లస్ అయ్యింది.
నరేష్ టీమ్‌లో జీవితకు చోటు ఇవ్వడం అతి పెద్ద ప్లస్ పాయింట్. మహిళా ఓట్లు అటు వైపుగా వెళ్లడానికి దోహదం చేశాయి.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు మార్పు కోరుకుంటారు. ‘ఈసారి మరొకరికి అవకాశం ఇద్దాం’ అనే ఆలోచన ఉంటుంది. ‘మా’ ఎన్నికలలోనూ అదే కనిపించింది. శివాజీ రాజా పై నెగిటీవ్ మార్కులు లేకపోయినా – మార్పు మంత్రం పనిచేయడంతో నరేష్ విజయం సాధించాడనిపిస్తోంది.