ప్రజాధనం రూ. 117 కోట్లు మూడంటే మూడు చెక్కులతో కొట్టేయడానికి దొంగలు ప్రయత్నించారు. నిజానికి ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు.. అనుమానం వచ్చినప్పుడు.. వెంటనే… విషయం ఆ చెక్కులు వేసిన వారికి కూడా తెలియకుండానే… వారిని పట్టుకుంటారు. మామూలు మోసగాళ్ల విషయంలో రెడ్ హ్యాండెడ్ ప్లాన్లను.. పోలీసులు అమలు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం…ఈ విషయంలో చాలా నింపాదిగా వ్యవహరిస్తున్నారు. మూడు రాష్ట్రాల పరిధిలో ఉందని… కొంత మంది అధికారుల పాత్ర ఉందని.. సీఐడీతో విచారణ చేయించాలని.. ఓ సారి.. ఏసీబీతో విచారణ కోసం మరోసారి ఇలా… చర్చలు నిర్వహిస్తూ టైం పాస్ చేస్తున్నారు.
ఓ భారీ నేరం జరగకుండానే బయటపడినప్పుడు.. దాన్ని ముందుగా మీడియాకు చెప్పడం కాదు.. ఆ నిందితుల్ని వేటాడి పట్టుకోవాలి. ఇంకా అలాంటి మోసాలు ఎన్నెన్ని చేశారో లెక్కలు తీయాలి. కానీ ఇక్కడ పోలీసులు ఆ చెక్కులు జారీ చేసిన సంస్థల పేరును కనిపెట్టి.. అంతర్రాష్ట్ర నేరం అని.. తాడేపల్లి పోలీసులు చేయలేరు కాబట్టి.. సీఐడీకి ఇవ్వాలని చర్చోపచర్చల తర్వాత నిర్ణయించారు. ఆ చెక్కులు ఇప్పటికి క్లియరెన్స్ కు వచ్చి ఐదు రోజులు దాటిపోయింది. పోలీసులు ఇంత స్లోగా ఉంటే.. నేరస్తులు కూడా అలా ఉండాలనేం లేదుగా.. ఈ పాటికి.. సర్దుకోవాల్సినవి సర్దుకుంటారు. ఆ విషయం పోలీసులకు తెలియక కాదు.
సీఎంఆర్ఎఫ్ ఫండ్ స్కామ్ విషయంలో ఉద్యోగుల పాత్ర లేకుండా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. నిజంగానే ఉండొచ్చు. అలాంటప్పుడు.. అంతర్గత విచారణ శరవేగంగా పూర్తి చేయాలి కానీ.. ఉద్యోగులపై ఏసీబీ.. అంతర్రాష్ట్ర విచారణకు సీఐడీ అంటూ టైమ్ పాస్ చేయరు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో రాత్రికి రాత్రి వెళ్లి నిందితుల్ని అరెస్ట్ చేసే పోలీసులు ప్రజాధనం రూ. 117 కోట్లు కొట్టేయడానికి ప్రయత్నించిన వారి విషయంలో మాత్రం.. చాలా స్లోగా ఉన్నారు. ఈ విషయంలో అనేక అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.