దక్షిణాదిలోనే కాదు, బాలీవుడ్లోనూ దాదాపు అందరు అగ్ర కథానాయకులతోనూ ఆడిపాడింది శ్రీదేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలాంటి వాళ్లతో అయితే లెక్కలేనన్నిసార్లు నటించింది. కృష్ణతో అత్యధికంగా 33 సినిమాల్లో కలసి నటించింది. అలాంటి శ్రీదేవి బాలకృష్ణతో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపించక మానదు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ని సెట్ చేయాలని అప్పట్లో చాలామంది దర్శకులు, నిర్మాతలు భావించారు. బాలయ్య కూడా ‘శ్రీదేవితో నటించాలి…’ అని తన దర్శకులు, నిర్మాతలతో చెప్పేవారట. కానీ… శ్రీదేవి మాత్రం ‘నో’ అనేసిందని ఓ టాక్. ఎందుకంటే.. ఎన్టీఆర్తో శ్రీదేవి చాలా చిత్రాల్లో నటించింది. ఆమెకు మనవరాలిగా కనిపించిన అమ్మాయే… ఆ తరవాత ఆయనతో కథానాయిగా జట్టు కట్టింది. ఎన్టీఆర్ తనయుడైన బాలకృష్ణనీ దాదాపు తాను కూడా తనయుడిలానే చూడడం మొదలెట్టిందని, అందుకే… బాలయ్యతో సినిమా అనేసరికి.. శ్రీదేవి ‘నో’ చెప్పిందని శ్రీదేవి సన్నిహితులు చెబుతుంటారు. శ్రీదేవి గనుక ‘ఎస్’ అని ఉంటే… బాలయ్యతో శ్రీదేవి కాంబినేషన్ ఎప్పుడో సెట్ అయ్యేది.