జగన్ ప్రమాణ స్వీకార వేడుకలకు వచ్చిన ఇద్దరు ఇతర రాష్ట్రాల కీలక నేతలు కేసీఆర్, స్టాలిన్. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వారి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. కేంద్రంపై కలిసి పోరాడటానికి ఎలాంటి అంశమైనా స్టాలిన్ అందరికీ లేఖలు రాస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో స్టాలిన్ కేసీఆర్తో మాత్రమే కాస్త ఎక్కువ సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ను పట్టించుకోవడం లేదు.
తమిళనాడులో ఫిడె చెస్ ఒలింపియాడ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులందర్నీ ఆహ్వానించారు. ప్రత్యేకంగా కేసీఆర్ వద్దకు ఓ ఎంపీని పంపించి ఆహ్వానపత్రిక అందించారు. స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. అయితే కేసీఆర్కు ఇంత గౌరవం ఇచ్చిన ఆయన ఏపీ సీఎం జగన్ను మాత్రం ఆహ్వానించలేదు. ఎవరైనా ఆహ్వానించి ఉంటే.. తమిళనాడు నుంచి ఎంపీ వచ్చారని.. జగన్ను ఆహ్వానించారని పీఆర్వో టీం ప్రకటించి ఉండేది. కానీ రాలేదు.
కేసీఆర్ను పిలిచినప్పుడు జగన్ను స్టాలిన్ను ఎందుకు పిలువలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెస్ ఒలింపియాడ్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు. ప్రధాని ప్రారంభిస్తున్నారు. అలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. అయినా స్టాలిన్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే. అయితే స్టాలిన్ ఆహ్వానించారని.. కానీ వెళ్లకూడదనుకున్నారు కాబట్టే బయటకు రానీయలేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. గతంలో విపక్షాల భేటీకి మమతా బెనర్జీ ఆహ్వానించినా.. తొక్కి పెట్టారు. ఆహ్వానం అందలేదని చెప్పుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం బయటపడింది.