వీరభోగ వసంత రాయులు సినిమా చూసినవాళ్లందరికీ సుధీర్ బాబు షాక్ ఇచ్చాడు. తన పాత్రకు వేరొకరు డబ్బింగ్ చెప్పడంతో… సుధీర్ బాబుకి డబ్బింగ్ చెప్పేంత తీరిక కూడా లేదా? అనే అనుమానాలు వేశాయి. అయితే నిజానికి ఇది తీరిక లేకపోవడం కాదు – దర్శకుడిపై అలగడం అని తేలింది.
ఔను.. సుధీర్‌బాబు అలిగాడట. దానికి కారణాలు చాలా ఉన్నాయి. టీజర్లో, ట్రైలర్లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చూపించాలన్నది సుధీర్‌బాబు డిమాండ్. అంతేకాదు… టైటిల్ కార్డులో తన పేరే ముందు పడాలని, ఇది పూర్తి గా సుధీర్‌బాబు సినిమాగా చలామణీ అవ్వాలని డిమాండ్ చేశాడట. దానికి దర్శకులు ఏమన్నారో, ఏమో గానీ… ఈ విషయమై సుధీర్‌బాబు అలిగాడని సమాచారం. సెట్లో కూడా తనకు వాల్యూ ఇవ్వడం లేదని.. తెగ ఫీలైపోయాడట. అందుకే.. డబ్బింగ్ కోసం బతిమాలినా… వెళ్లలేదని తెలుస్తోంది. తనకు రావల్సిన రెమ్యునరేషన్ అడిగి మరీ తీసుకుని… అకౌంట్ సెటిల్ చేసుకున్న సుధీర్.. డబ్బింగ్‌కి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమా రిజల్ట్ చూసిన సుధీర్ బాబు.. `ఈ మాత్రం సినిమాకి నేను అలిగానా?? అసలు ఇందులో నేనున్నానని ప్రేక్షకులు మర్చిపోతే బాగుణ్ణు` అని దండం పెట్టుకుంటాడేమో. ఎందుకంటే… ఈ సినిమా రివ్యూలు ఆ రేంజులో ఉన్నాయి. సుధీర్ బాబు నటన కూడా అంతంత మాత్రంగానే సాగింది. అసలు నటన అంటే ఏమిటో తెలీనట్టు కనిపించాడు. బహుశా… అన్యమనస్కంగా సెట్‌కి వచ్చాడేమో.