కమిడియన్ గా స్టార్ హోదాలో ఉండగానే హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు.. ఇలా తొలి రోజుల్లో మంచి హిట్లే కొట్టాడు. అయితే ఆ తరవాతే.. ట్రాక్ తప్పింది. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండా ఏళ్లకు ఏళ్లు లాగించేశాడు. ఇక లాభం లేదని మళ్లీ కమిడియన్ గా యూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కామెడీ పండించే బాధ్యత భుజాన వేసుకున్నాడు. కమిడియన్ గా బిజీ. మరోవైపు విలన్ వేషాలేస్తున్నాడు. ఇంకోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే.. హీరోగా చేస్తున్న సినిమాలేవీ క్రేజీ ప్రాజెక్టులు కావు. `కనబడుటలేదు` అనే ఓ సినిమా చేశాడు సునీల్. ఆ సినిమా ఇప్పటి వరకూ లో ప్రొఫైల్ లోనే ఉంది. `వేదాంతం రాఘవయ్య` అనే మరో ప్రాజెక్ట్ పై సునీల్ సంతకం చేశాడు. ఈ సినిమా మొదలై చాలా రోజులైనా ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందా? ఆగిపోయిందా? అనేదే ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇవి కాక మరో రెండు మూడు సినిమాల్లో తాను హీరో. ఇవన్నీ చిన్నా చితకా సినిమాలే. `కలర్‌ఫొటో` అనే సినిమాలో విలన్ గా చేసినా, అదీ చిన్న సినిమానే. పైగా ఓటీటీలో విడుదల అవ్వడంతో తన శ్రమకి తగిన గుర్తింపు రాలేదు. దీంతో సునీల్ కి అసలు ప్లానింగ్ ఉందా, లేదా? అనే అనుమానం వేయడం ఖాయం. సునీల్ సినిమాకి ఒకప్పుడు ఏడెనిమిది కోట్ల మార్కెట్ జరిగేది. ఆయా సినిమాల ప్రమోషన్లు కూడా బాగుండేవి. బ్యానర్ ఏమిటి? వాళ్లు సరిగా ప్రమోట్ చేయగలరా? లేదా? తన సినిమాలో ప్యాడింగ్ ఎలా ఉండబోతోంది? ఇలాంటివన్నీ ఆలోచించుకునే సినిమాల్ని ఒప్పుకునేవాడు. అయితే అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టాడా? అనిపిస్తోంది. చేతిలో సినిమాలుంటే చాలు.. అన్నట్టుంది సునీల్ వ్యవహారం. ఇలాంటి ప్లానింగ్ తో సునీల్ నాలుగు సినిమాల్ని, కొంత డబ్బుని వెనకేసుకోగలడేమో. కానీ లాంగ్ టర్మ్‌లో ఇబ్బంది పడొచ్చు. ఈ విషయాన్ని సునీల్ ఎప్పుడు తెలుసుకుంటాడో?