జగన్ రెడ్డి లండన్ నుండి.. బెంగళూరు.. అక్కడి నుండి తాడేపల్లి వచ్చి రెండు రోజులు ఉన్నారు. ఆయన వచ్చిన రోజున జగన్ 2.0 అనే డైలాగులు కొట్టారు. అదే రోజున ఇంటి ముందు ప్రజా ధనంతో ఆయన పేదల ఇళ్లను కూలగొట్టి అక్కడ చేయించుకున్న బ్యూటిఫికేషన్ మొక్కలకు ఎవరో నిప్పు పెట్టారు. దానిపై వైసీపీ నేతలు పెద్ద రచ్చ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు తగలబెట్టారో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అక్కడ జగన్ రెడ్డి పక్కాగా ప్రజాధనంతో భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని కోణాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరు ఆ బ్యూటిఫికేషన్ మొక్కలకు నిప్పు పెట్టారో సులువుగా గుర్తించేలా వీడియోలు రికార్డు అయి ఉంటాయి. వాటిని ఇస్తే కేసు క్లియర్ అయిపోతుంది. అయితే పోలీసులు వాటిని ఇవ్వాలని తాడేపల్లి ప్యాలెస్ కు పదే పదే నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. సాక్ష్యాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
నిజానికి అక్కడ ఎవరైనా.. వైసీపీకి తెలియని వాళ్లు, టీడీపీ లేదా జనసేన పార్టీలకు చెందిన వాళ్లు నిప్పు పెడితే వెంటనే సీసీ ఫుటేజీ సాక్షిలో ప్రత్యక్షమయ్యేది రచ్చ రచ్చ చేసేవాళ్లు. కానీ అక్కడ నిప్పు ప్రమాదవశాత్తూ అయినా అంటుకుని ఉండాలి లేకపోతే వైసీపీకి చెందిన ఎవరైనా నిప్పు పెట్టి ఉండాలి. అందుకే దృశ్యాలను ఇచ్చేందుకు తాడేపల్లి ప్యాలెస్ సిద్దపడటం లేదు. కోడికత్తి కేసు నుంచి అనేక కేసుల్లో ఇదే తరహా వ్యూహాన్ని వైసీపీ పాటిస్తుంది. ఆరోపణలు చేస్తారుకానీ కానీ సాక్ష్యం చెప్పరు.. ఇంట్లో ఉన్న సాక్ష్యాలు ఇవ్వరు.