ఒకప్పుడు పార్టీలో కీలకనేతగా ఉంటూ, కీలకమైన పదవి అనుభవించిన నాయకులు… టీడీపీ అధికారం కోల్పోగానే సొంత పనులకే పరిమితం అవుతున్నారు! పార్టీలో ఉన్నా కూడా.. మెల్లగా ముఖం చాటేస్తున్నారు. పార్టీ తరఫున బలంగా మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా కొంతమంది నేతలు మౌనం వహిస్తారు. అలాంటివారిలో ఒకరు మాజీ మంత్రి నారాయణ. చంద్రబాబు సర్కారులో ఆయనకు దక్కిన ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఒక దశలో టీడీపీలో ఆయనే నంబర్ టు అనేంతగా ఉండేవారు. రాజధానిలో ఏ పని జరగాలన్నా ఆయన వల్లనే సాధ్యం అనే ప్రచారం ఉండేది. రాజధాని అమరావతిలో ఎలాంటి నిర్మాణాలైనా, దానికి సంబంధించిన ఏ చిన్న నిర్ణయాలైనా నారాయణే క్రియాశీలంగా ఉంటూ వచ్చారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు సీఆర్డీయే వ్యవహారాలు అప్పగించి, ఆయన సలహా లేనిదే ఏ నిర్ణయమూ తీసుకునేవారు కాదు.
ఇంతకీ.. ఇప్పుడు అవసరం తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఉందా అంటే, కచ్చితంగా ఉందనే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ప్రస్తుత వైకాపా సర్కారు టీడీపీ హయాంలో అవినీతిని తవ్వితీస్తామంటూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత పాలనలోఅవకతవకలపై ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి మరీ అధ్యయనం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని అమరావతి అంతా అవినీతిమయమనీ, పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారంటూ గత టీడీపీ సర్కారుపై అధికార పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, గతంలో రాజధాని నిర్మాణాలకి సంబంధించిన కీలక బాధ్యతలు చూసింది ఎవరు.. నారాయణే కదా! అన్ని చోట్లా ఆయనే ఉండేవారు కదా. కాబట్టి, ఇప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఉందనేది టీడీపీ వర్గాలో చర్చ.
అమరావతిలో అంతా అవినీతే అంటూ వైకాపా సర్కారు విమర్శలు చేస్తుంటే, పార్టీ తరఫున మాజీ మంత్రిగా స్పందించాల్సిన బాధ్యత నారాయణదే అంటున్నారు. ఆయన స్పందిస్తేనే కరెక్ట్ అంటున్నారు. కానీ, ఆయనేమో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత మీడియా ముందుకు వచ్చిందీ లేదు! పార్టీ తరఫున మాట్లాడుతున్నదీ లేదు. చివరికి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న పార్టీ సమావేశాల్లో కూడా క్రియాశీలంగా ఉండటం లేదట! అందరితోపాటు వచ్చామా విన్నామా వెళ్లామా అన్నట్టుగానే ఉంటున్నారట. ఎందుకీ మౌనం అని ఎవరైనా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే… ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని చెప్తున్నారట. వాస్తవం మాట్లాడుకుంటే… నారాయణ కూడా కార్పొరేట్ పొలిటీషియనే! ఆయనకు పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. వ్యాపారాలున్నాయి. ఈ మాత్రం చాలు కదా!